రైతుభరోసా చివరి విడత నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్, వాకిటి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్, ఎంపీలు బలరామ్‌నాయక్, రఘురాంరెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, రాగమయి, వెంకటేశ్వర్లు, రాందాస్ తదితరులు
ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి
2029 మే – జూన్‌లో అసెంబ్లీ ఎన్నికలు
అసెంబ్లీ స్థానాలు 182కు, ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయి
కాంగ్రెస్ 117 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తుంది
ఇది భద్రాచలం రాముడి మీద ఆన.. కాస్కో కేసీఆర్
రైతుల కోసం 30 నెలల్లో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం
కోట్లాది మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి
రైతుభరోసా కింద రూ.1,009 కోట్ల నిధులు విడుదల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘గత ఎన్నికలకు ఆరు నెలల ముందే జోస్యం చెప్పా. ఇప్పుడు 2029 ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి చెబుతున్నా. అసెంబ్లీ ఎన్నికలు 2029 మే – జూన్ మధ్య జరుగుతాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సీట్లు 26కి, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 182 శాసనసభ స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలిచి రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.
అలాగే 20 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకుని రాహుల్‌గాందీని ప్రధానమంత్రి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌరవ వంశంగా ఉన్న కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీది నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. ఇది భద్రాచలం రాముడి మీద ఆన. కాస్కో చంద్రశేఖర్‌రావు...’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద జరిగిన రైతు ఆశీర్వాద సభలో చివరి విడత రైతుభరోసా కింద రూ.1,009 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
అప్పుడు 65 సీట్లు గెలుస్తామని చెప్పా..
‘2023 జూలైలో భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా ఖమ్మంలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై వచ్చారు. ఈ సభ తర్వాత గాం«దీభవన్‌లో పాత్రికేయ మిత్రులు కలిసి బీజేపీ వేగంగా వస్తోంది, బీఆర్‌ఎస్, కేసీఆర్ మాయమాటలు, మూటలను తట్టుకుని ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? అని అడిగారు.
కానీ ఖమ్మం సభ చూశాక కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, సీపీఐ ఒక్క సీటు గెలుస్తుంది, బీజేపీ 8 –9 సీట్లు, ఎంఐఎం 6–7 సీట్లు పోగా మిగిలిన చోట్ల మాత్రమే కేసీఆర్, కేసీఆర్ భజనపరులు గెలుస్తారని చెప్పా. అదే తరహాలో కాంగ్రెస్ 64 సీట్లు గెలవగా.. ఉప ఎన్నికల్లో ప్రజలు మరో రెండు సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే జరిగింది. ప్రజాతీర్పు ద్వారా పాపాల భైరవుడిని ఫార్మ్ హౌస్‌లో బంధించినం..’ అని రేవంత్ అన్నారు.
అన్నం తినేటోడు ఇప్పుడు సర్వేలు చేయిస్తడా..
‘రేవంత్‌రెడ్డి సర్వే చేసుకుంటే మేము గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నారు.. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలవకుండా సర్వేలు చేయిస్తడా?..’ అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం విమర్శలు చేశారు. ‘మొన్న కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డలో నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండన్నడు. మేడిగడ్డ గేట్లు దించి నీళ్లు నిలబెడితే.. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండడు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోతాయి. నీ లుచ్చా రాజకీయాల కోసం మేడిగడ్డ నింపి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చేయాల్నా?..’ అని మాజీమంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఉచిత కరెంట్‌పై సంతకం చేసింది వైఎస్సార్
‘రైతుల కోసం 30 నెలల కాలంలో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. సన్న బియ్యంతో కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతోంది. రైతును రాజును చేయాలన్న ఆలోచనతో తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్‌ది. ఉచిత కరెంటు మా పేటెంట్. 2004లో ఎల్‌బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొట్టమొదటి సంతకం పెట్టి, రైతాంగానికి ఉచిత కరెంట్ అందించడంతో పాటు రైతుల మీద ఉన్న వేల కేసులను తొలగించారు..’ అని సీఎం తెలిపారు.
రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దాం..
‘మోదీ, అమిత్ షా.. మమతా బెనర్జీ పార్టీ, ఆప్‌ను చీల్చి, ఇతర పార్టీలను లొంగతీసుకుని సీట్లు పెంచాలన్న బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్లు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఈనెల 20న ఢిల్లీకి వెళ్తున్నా, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం«దీని కలుస్తున్నా.
26 పార్లమెంట్ సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని చెప్పదలుచుకున్నా. ఖమ్మంలో, ఇదే ప్రాంతంలో 5 లక్షల మందిని ఆహ్వానించి రాహుల్‌గాంధీతో సభ ఏర్పాటు చేస్తాం. భద్రాద్రి రాములోరి ఆశీర్వాదంతో రాహుల్‌గాం«దీని దేశానికి ప్రధానమంత్రిని చేసేవరకు మనం విశ్రమించొద్దు..’ అని రేవంత్ పిలుపునిచ్చారు.
మొక్కజొన్న రైతులకు రూ.3,504 కోట్లు
సభావేదిక పైనుంచి రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు, యాసంగి సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నకు గాను రైతులకు రూ.3,504 కోట్లు సీఎం విడుదల చేశారు. భూధార్‌కు సంబంధించి పైలట్ గ్రామంగా సర్వే పూర్తి చేసిన ఖమ్మం జిల్లా ములుగుమాడులోని రైతులు ముగ్గురికి లాంఛనంగా ఈ–పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు.
అవన్నీ చెక్కు చెదరలేదు.. కాళేశ్వరం కూలిపోయింది: భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు దశాబ్దాలైనా చెక్కు చెదరలేదని, కొన్ని వందల టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టులు ఇప్పటికీ నీళ్లు అందిస్తుంటే.. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచి్చన బీఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. ‘గోదావరిపై ప్రాజెక్టులతో రూ.లక్షల కోట్లు దోపిడీ చేశారు. దోపిడీలకు పాల్పడే ఇలాంటి గుంటనక్కలు, తోడేళ్లను రాష్ట్రంపై మరోసారి పడనివ్వబోం..’ అని భట్టి అన్నారు.
ప్రతీ గజాన్ని సర్వే చేస్తాం: పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘భూభారతి ద్వారా ప్రస్తుతం 70 గ్రామాల్లో సర్వే చేస్తున్నాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి సాగులో ఉన్న వారికి మ్యాప్‌తో భూధార్ కార్డు ఇస్తాం..’ అని తెలిపారు. ఇప్పటికే రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారని, మళ్లీ ఎన్నికలు వచ్చినా బుద్ధి చెబుతారని అన్నారు.
30 మాసాల్లో రూ.36 వేల కోట్ల రైతుభరోసా: తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతుభరోసా కింద 30 మాసాల కాలంలో రూ.36 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.72 వేల కోట్లు మాత్రమే జమ చేసిందని విమర్శించారు. ఈ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, డాక్టర్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, నవీన్‌యాదవ్, నాగరాజు, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


