వ్యవసాయం దండుగ కాదు.. పండుగ
సీఎం సభ సైడ్‌లైన్స్
తెలంగాణ ఉద్యమం ఖమ్మంలోనే పుట్టింది..
ఖమ్మం నాడు.. నేడు ఉప్పెన
ఆనాడు బీఆర్‌ఎస్ హయాంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడి హోదాలో నేను పాదయాత్రగా తెలంగాణలో నలుమూలలా తిరిగాం. 2023 జూలైలో ఇక్కడ అద్భుత సన్నివేశం కనిపించింది. ఆనాడు ఆదిలాబాద్‌లో మొదలైన భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా సభ ఏర్పాటు చేసి కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఆ సభకు ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పైనె కమ్మేసి, ఆనాడు బీఆర్‌ఎస్‌ను బొందపెట్టారు. ఇప్పుడు మళ్లీ జూలైలో సభ పెడితే ఉప్పైనె వచ్చారు.
సలాకాలు కాల్చి వాతలు పెడతారు..
ఖమ్మంలో ఒకాయన శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా? మీరిక్కడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్‌లో ఆయనను ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటోళ్లు చాలామంది ఉన్నారు. బీఆర్‌ఎస్ వాళ్లందరినీ కర్రు కాల్చి, సలాకాలు కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతున్నరు. నాటి ప్రభుత్వం చంద్రశేఖర్‌రావు మొదలుపెట్టిన పథకాలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతు భరోసా, లేకపోతే ఏ పథకమైనా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా..? మీరు ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా అమలు చేసినం.
రూ.2 వేలు పెంచి రైతుభరోసా
రైతు బంధుకు ఏటా రూ.10 వేలు అంటే తుమ్మల, భట్టి సూచనలతో రూ.2 వేలు పెంచి ఏడాదికి రూ.12 వేలు.. 30 నెలల్లో రూ.36,135 కోట్లు రైతు భరోసా పథకానికి ఇచ్చాం. నాడు కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూ కోట శ్రీనివాసరావు కథలు చెప్పినట్టు కోడిని పైన కట్టి, సద్దన్నం కింద తిన్నట్లు మోసం చేశాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత 4.50 లక్షలు, రెండో విడత 2.50 లక్షలు కట్టి, ఖమ్మం జిల్లాలోనే గిరిజన సోదరుల మధ్యన గృహ ప్రవేశాలు చేసింది నేను కాదా? గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బువ్వ నేను వచ్చి తినిపోలేదా? పేదలకు సన్న బియ్యం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చాం. రైతులకు రూ. 20,617 కోట్ల రుణమాఫీ చేశాం.
అక్కలు కళకళలాడుతున్నారు..
మా అక్కలు పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చారు. మా అక్కలు కళకళలాడుతున్నారు. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర కట్టుకొని ఇయ్యాల నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాం. 30 నెలల్లో ఆడబిడ్డల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాం. వేయి బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినం. పెట్రోల్ బంకులు పెట్టిచ్చినాం. శిల్పారామం దగ్గర రూ.వేయి కోట్లతో మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ల ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. రూ.లక్షల కోట్ల అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించినా.. ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని జాగ్రత్తగా, సమయస్ఫూర్తితోని నడిపించి, ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు, ఈనాడు అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరినట్లు మధిరకు ఇంజనీరింగ్ కళాశాల ఇస్తాం.
ఇంకా ఈ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, డాక్టర్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, నవీన్‌యాదవ్, నాగరాజు, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, ఈర్లపల్లి శంకర్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం దండగ కాదు, పండుగ కావాలని, రైతును రాజును చేయాలన్న ఆలోచనతో తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా నిధులు ఇవ్వాలని నన్ను, భట్టిని అడిగారు. అందుకే గత ఏడాది జూన్‌లో తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా మీ ఖాతాలో వేశాం. ఈ ఏడాది కూడా మధిర వేదికగా గత నెల 30వ తేదీన రైతుల ఖాతాల్లో నిధులు వేయాలనుకున్నాం. అది కుదరకున్నా నిధుల బదిలీ వాయిదా వేయలే. శిల్పారామంలో మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేశాం. సరిగ్గా తొమ్మిది రోజులకు ఇక్కడ సభ పెట్టి చివరి విడత నిధులు ఖాతాల్లో వేశాం.
సభా ప్రాంగణానికి ఉదయం 10 గంటల నుంచే జనం మొదలయ్యారు.
మధ్యాహ్నం 3గంటలకు రావాల్సిన సీఎం హెలీకాప్టర్ 3–35 గంటలకు చేరింది.
హెలీప్యాడ్ వద్ద సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు స్వాగతం పలకగా.. వేదికపైకి 3.53 గంటలకు చేరుకున్నారు.
తొలుత తెలంగాణ రాష్ట్ర గేయం ఆలపించాక, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, ఆపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు.
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా జనం కేరింతలు కొట్టారు.
4.58 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా చివరి విడత నిధులను విడుదల చేయగా.. 5 గంటలకు తన ప్రసంగాన్ని మొదలుపెట్టి 5–40 గంటలకు ముగించారు.
ఇదే వేదికపై మొక్కజొన్న అమ్మిన రైతులకు నిధులు, ములుగుమాడు రైతులు ముగ్గురికి ఈ–పాస్ బుక్‌లు సైతం అందజేశారు.
సీఎం ప్రసంగంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డిదే అని చెబుతున్న సమయాన సభా ప్రాంగణం కేరింతలు, ఈలలతో మార్మోగింది.
సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 6–03 గంటలకు హెలీకాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరారు.
– చింతకాని / బోనకల్
తొలి తెలంగాణ ఉద్యమం 1969లో నాటి ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టింది. తోటి ఉద్యోగుల కోసం ఉద్యమం మొదలైంది. నాడు ఖమ్మంలో జరిగిన ఉద్యమమే తెలంగాణ సాధించేందుకు కారణమైంది. చంద్రశేఖర్‌రావు మాత్రం నిరుద్యోగుల కల నెరవేర్చలే. మేము అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది 67,717 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇందులో ఇంజనీర్లు, డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పలు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.


