తక్కువ సమయంలోనే సభకు ఏర్పాట్లు
కలెక్టర్, సీపీ సమన్వయంతో
విజయవంతం
ట్రాఫిక్‌కు అంతరాయం రాకుండా పోలీసుల పర్యవేక్షణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు ఆశీర్వాద సభ సజావుగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు హాజరయ్యారు. ఈ సభ కోసం కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్ సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.
అప్పట్లో కురిసి.. ఇప్పుడు కరుణించి
రైతు భరోసా నిధుల విడుదలను మొదలు పెట్టేందుకు గత నెల 30న మత్కేపల్లి క్రాస్ వద్ద సభ నిర్వహించాలని నిర్ణయించింది. అంతకుముందు రెండు రోజులు మెగా రైతుమేళా నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే, వర్షంతో ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారి సభ రద్దయింది. ఫలితంగా రైతుభరోసా నిధులను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేశారు. అయితే, ఇక్కడ ఎలాగైనా సభ నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం భట్టి పట్టుదలతో అధికారులు పది రోజుల్లో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా గురువారం మెగా రైతుమేళా నిర్వహించడంతో పాటు వర్షం కురిసినా ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేశారు. మరోపక్క శుక్రవారం వరణుడు కరుణించడంతో వర్షం కురవకపోగా.. సభ సజావుగా సాగింది.
వారం పాటు శ్రమించి..
అధికార యంత్రాంగం వారం పాటు సభ నిర్వహణ కోసం అహర్నిశలు శ్రమించింది. కలెక్టర్ దివాకర టీ.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అధికారులకు సూచనలు ఇస్తూ ప్రజల తరలింపు, మ్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. ఓవైపు వర్షం కురుస్తుందనే అనుమానంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, ట్రాఫిక్ జామ్ కాకుండా రూట్లు నిర్ణయించడంతో అంతా ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే వాహనాల రాక మొదలు కావడంతో మధ్యాహ్నం 12 గంటల కల్లా పార్కింగ్ ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఆపై వాహనాలు దూరంగా నిలిపివేస్తుండడంతో సీపీ సునీల్‌దత్ స్వయంగా బైక్‌పై తిరుగుతూ పర్యవేక్షించారు.


