వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు | - | Sakshi
Sakshi News home page

వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు

Jul 11 2026 12:07 AM | Updated on Jul 11 2026 12:07 AM

● రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున చేరిక ● 15 అడుగులు దాటగానే నారుమడులకు విడుదల

● రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున చేరిక ● 15 అడుగులు దాటగానే నారుమడులకు విడుదల

వైరా: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు చేరాయి, ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఎస్కేప్‌ లాక్‌ల నుంచి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 13.7 అడుగుల నీరు ఉండగా, రోజుకు 500 క్యూసెక్కుల గోదావరి జలాలు చేరే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు రెండు అంగుళాల చొప్పున నీటిమట్టం పెరిగితే ఈనెలాఖరుకు రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టమైన 18.4 అడుగులకు చేరుతుందని భావిస్తున్నారు. అయితే, 15 అడుగులకు చేరాక కుడి, ఎడమ కాల్వల ద్వారా వరి నారుమడులకు అవసరమైన నీరు విడుదల చేసేందుకు అఽధికారులు సిద్ధమవుతున్నారు. ఈసారి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీరు చేరక సాగుపై నీలినీడలు కమ్ముకోగా, గోదావరి జలాలు విడుదల చేయడంపై ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, సిరిపురం మేజర్‌ కాల్వ పూర్తయితే 18 కి.మీ. మేర ప్రయాణిస్తే గోదావరి జలాలు రిజర్వాయర్‌కు చేరతాయి. ప్రస్తుతం ఏన్కూరు ఎస్కేప్‌ లాక్‌ల ద్వారా 20 కి.మీ. మేర జలాలు ముందుకు సాగుతూ రిజర్వాయర్‌లోకి వస్తున్నాయి.

ఇది మా అదృష్టం

ఏన్కూరు/జూలూరుపాడు: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌లోకి తీసుకొచ్చి సాగు అవసరాలకు ఇవ్వనుండడం తమ అదృష్టమని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌ తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్‌హౌస్‌ నుంచి జూలూరుపాడు మండలం వినోభానగర్‌ వద్దకు ప్రధాన కాల్వ ద్వారా చేరిన గోదావరి జలాలను శుక్రవారం ఆయన సాగర్‌ ఎడమ కెనాల్‌కు అనుసంధానం చేసిన ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌లోకి వదిలారు. అలాగే, ఏన్కూరు వద్ద లింక్‌ కెనాల్‌కు జలాలు చేరాక చీర, సారె సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచామన్నారు. ఫలితంగా కృష్ణా ఆయకట్టులో ఇబ్బంది ఉన్నా గోదావరి జలాలు అందించగలిగామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో జల వనరులశాఖ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల సీఈలు ఎం.వెంకటేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ బాబూరావు, డీఈ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ గంగావత్‌ నవీన్‌, కాంగ్రెస్‌ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు, గుత్త వెంకటేశ్వరావు, స్వర్ణ నరేందర్‌, భూక్యా లాలు, గుగులోతు లచ్చిరాం నాయక్‌, లేళ్ల వెంకటరెడ్డి, మాలోత్‌ మంగీలాల్‌ నాయక్‌, చౌడం నరసింహారావు, దుద్దుకూరి మధుసూదన్‌రావు, వి.నరసింహారావు, మోదుగు రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement