హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 237వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 247 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 120, రెవెన్యూ శాఖకు సంబంధించి 45, హోం శాఖకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు అందాయి.
ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులను స్వీకరించి ఎండార్స్ మెంట్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
సీఎం ప్రజావాణిని సందర్శించిన క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సందర్శించారు. సీఎం ప్రజావాణి, ప్రవాసి సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. కాగా డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్స్ తమకు ఫిక్స్డ్ గౌరవ వేతనం ఇప్పించాలని, ఎడాదికి పది నెలలు పని దినాలు కల్పించాలని కోరారు. స్పోర్ట్స్ కోటా కింద స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చిన్నారెడ్డి, విద్యా సాగర్ కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సమన్వయ వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, ప్రతినిధి పద్మారాణి కర్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


