ఖమ్మం: బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌరవవంశం కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ నుంచి తరిమికొడతామంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేది తామేనన్న సీఎం రేవంత్.. 117 అసెంబ్లీ సీట్లలో విజయం సాధిస్తామన్నారు. ఇది భద్రాచలం రాముడి సాక్షిగా చెబుతున్నమాట అని, కేసీఆర్ రాసిపెట్టుకోవాలంటూ కూడా సవాల్ విసిరారు. 2028లో ఎన్నికలు కాదు.. 2029 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్లమెంట్‌కు 26 అసెంబ్లీకి 182 సీట్లు పెరుగుతాయని కూడా రేవంత్ జోస్యం చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వా సభ నిర్వహించారు. ఈ సభలో రైతు భరోసా కింద నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్. రైతు భరోసా కింద రూ. 1009 కోట్లు విడుదల చేశారు సీఎం రేవంత్. ఇప్పటికే 74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందగా, తాజాగా మరో రూ. 1000 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకూ రైతు భరోసా కింద రైతులకు మొత్తం రూ. 8, 759 కోట్ల నిధులు విడుదల చేశారు.
దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రజాపాలనను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా తనకు గుండె లాంటిదని వ్యాఖ్యానించారు. గడిచిన 10 ఏళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందంటూ మండిపడ్డారు. గత పాలనలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులకు బేడీలు వేశారని ఆరోపించారు. చెప్పింది చెప్పినట్లు చేయడం వల్లనే ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉందన్నారు. ‘కౌరవ వంశాన్ని’ తెలంగాణ గడ్డ నుంచి తరిమికొడతానని విమర్శించారు.


