దెబ్బ మీద దెబ్బ.. పుండు మీద కారం.. జుకర్‌బర్గ్‌ ఉక్కిరిబిక్కిరి | Modi Video To 567M Dollars Fine, List Of 10 Shocking Controversies That Followed Zuckerbergs Meta, More Details Inside | Sakshi
Sakshi News home page

దెబ్బ మీద దెబ్బ.. పుండు మీద కారం.. జుకర్‌బర్గ్‌ ఉక్కిరిబిక్కిరి

Aug 7 2026 9:26 AM | Updated on Aug 7 2026 10:10 AM

Modi Video to 567M Dollars Fine: 10 Shocks Rocking Zuckerbergs Meta

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌ మీడియా సామ్రాజ్యం అది. ప్రపంచాన్ని కలిపిన వేదికగా ఎదిగిన ఆ సంస్థ.. అదే సమయంలో టెక్‌ రంగంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీగా నిలిచింది. పేరు మార్చుకుని ఫేస్‌బుక్‌ నుంచి మెటాగా మారినా.. ఫేట్‌ మాత్రం మారడం లేదు. విమర్శలు, కోర్టు కేసులు, బిలియన్ల డాలర్ల జరిమానాలు, చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు.. ఆ ప్రయాణంలో భాగంగా కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందనే ఆరోపణలతో అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాపై భారీ జరిమానా విధించింది. మైనర్ల భద్రత విషయంలో సంస్థ విఫలమైందని, వినియోగదారులను ఎక్కువ సమయం ప్లాట్‌ఫామ్‌లలోనే గడిపేలా చేసే ఫీచర్లను రూపొందించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మెటాకు మొత్తం 567 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,700 కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఇదే కాదు..

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించిన ఘటన కూడా మెటాకు ఇబ్బందులు తెచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే వీడియో తొలగించామని వివరణ ఇచ్చిన సంస్థ.. అనంతరం భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. అయితే ఇవి మెటాకు ఎదురైన తొలి వివాదాలు కావు. 

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల చుట్టూ గతంలోనూ డేటా లీకులు, ప్రైవసీ ఉల్లంఘనలు, ఫేక్‌ న్యూస్‌, పిల్లల భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరిగాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపిన వేదికగా పేరు తెచ్చుకున్న మెటా.. ఇప్పుడు బాధ్యత, భద్రత, పారదర్శకత వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

కేంబ్రిడ్జ్‌ అనలిటికా షాక్‌
ఫేస్‌బుక్‌(మెటా) చరిత్రలో అత్యంత పెద్ద కుదుపు తెచ్చిన ఘటనల్లో ఇది ఒకటి. కోట్లాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం వారి అనుమతి లేకుండా సేకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అమెరికా కాంగ్రెస్‌ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో ఫేస్‌బుక్‌ డేటా భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

పిల్లల భద్రతపై ప్రశ్నలు
ఇన్‌స్టాగ్రామ్‌ యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందం, ఫాలోవర్లు, లైక్‌ల సంస్కృతి యువతలో ఒత్తిడిని పెంచుతోందని విమర్శలు వచ్చాయి. అంతర్గత పరిశోధనల్లో కొన్ని సమస్యలు బయటపడినా సంస్థ తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలతో మెటా ఇప్పుడు కోర్టు కేసులను ఎదుర్కొంటోంది.

జుకర్‌బర్గ్‌ క్షమాపణలు.. సెనేట్‌లో భావోద్వేగ క్షణాలు
పిల్లల ఆన్‌లైన్‌ భద్రతపై అమెరికా సెనేట్‌ విచారణ సందర్భంగా మార్క్‌ జుకర్‌బర్గ్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఉద్దేశించి ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారనే ప్రచారం జరిగినప్పటికీ, అధికారిక రికార్డుల్లో ఆయన ఏడ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ పిల్లల భద్రత అంశంపై ఆయన భావోద్వేగానికి గురైన విషయం మాత్రం చర్చనీయాంశమైంది.

ఫేక్‌ న్యూస్‌ తుఫాను.. ఎన్నికలపై సోషల్‌ మీడియా ప్రభావం
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించడం అనేక దేశాల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రచారం జరుగుతోందనే ఆరోపణలు రావడంతో మెటా కంటెంట్‌ నియంత్రణ విధానాలపై ప్రశ్నలు తలెత్తాయి.

వాట్సాప్‌ పాలసీ వివాదం.. యూజర్లలో పెరిగిన అనుమానాలు
2021లో వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించడంతో పెద్ద వివాదం మొదలైంది. యూజర్ల డేటా ఫేస్‌బుక్‌తో పంచుకుంటారనే భయంతో చాలామంది ప్రత్యామ్నాయ మెసేజింగ్‌ యాప్స్‌ వైపు వెళ్లారు. ఆ తర్వాత మెటా వివరణలు ఇచ్చినా.. ప్రైవసీపై ప్రజల్లో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.

మయన్మార్‌ ఘటనలు.. ద్వేష ప్రచారంపై ఫేస్‌బుక్‌ విమర్శలు
మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన హింస సమయంలో ద్వేష ప్రచారం వ్యాప్తికి ఫేస్‌బుక్‌ వేదికగా మారిందనే విమర్శలు వచ్చాయి. కంటెంట్‌ పర్యవేక్షణలో తమ వైఫల్యాలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియా బాధ్యతపై కొత్త చర్చకు ఇది కారణమైంది.

లైక్‌ల మాయాజాలం.. ఇన్‌స్టాగ్రామ్‌ అల్గారిథమ్‌పై ఆరోపణలు
యువత ఎక్కువ సమయం యాప్‌లో గడిపేలా ఇన్‌స్టాగ్రామ్‌ డిజైన్‌ చేశారనే విమర్శలు వచ్చాయి. లైక్‌లు, కామెంట్లు, ఫాలోవర్ల కోసం పరుగులు పెట్టేలా చేసే అల్గారిథమ్‌ యువతలో ఆందోళన, అసంతృప్తిని పెంచుతోందని నిపుణులు హెచ్చరించారు.

మెటావర్స్‌ కల.. భారీ పెట్టుబడులు, భారీ నష్టాలు
ఫేస్‌బుక్‌ పేరును మెటాగా మార్చిన జుకర్‌బర్గ్‌.. వర్చువల్‌ ప్రపంచమైన మెటావర్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు. భారీ ఖర్చులు, షేర్‌ విలువ పతనం, ఉద్యోగుల తొలగింపులతో మెటాకు కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి.

డేటా గోప్యతపై యూరప్‌ కఠిన చర్యలు
యూరోపియన్‌ యూనియన్‌ డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మెటాపై పలు సందర్భాల్లో భారీ జరిమానాలు విధించాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహించాలన్న విషయంలో టెక్‌ కంపెనీలకు యూరప్‌ గట్టి హెచ్చరికలు ఇచ్చింది.

ఏఐ యుగం.. డీప్‌ఫేక్‌లతో కొత్త తలనొప్పులు
కృత్రిమ మేధస్సు పెరుగుతున్న కొద్దీ మెటాకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డీప్‌ఫేక్‌ వీడియోలు, నకిలీ కంటెంట్‌, పిల్లలకు సంబంధించిన ప్రమాదకరమైన కంటెంట్‌ విషయంలో సంస్థపై ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తులో సోషల్‌ మీడియా కంపెనీలకు కేవలం టెక్నాలజీ సరిపోదని.. బాధ్యత కూడా అవసరమని ఈ వివాదాలు గుర్తుచేస్తున్నాయి.

జరిమానాల చరిత్ర కూడా మెటాకు ఓ పెద్ద మచ్చగానే మిగిలింది. ఫేస్‌బుక్‌ పేరుతో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు డేటా ప్రైవసీ, యూజర్ల సమాచారం దుర్వినియోగం, పిల్లల భద్రత వంటి అంశాల్లో మెటాపై బిలియన్ల డాలర్ల జరిమానాలు పడ్డాయి. ఇందులో అత్యంత భారీ దెబ్బ 2019లో కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా వివాదం కేసులో అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (FTC) విధించిన 5 బిలియన్‌ డాలర్ల జరిమానా. ఆ తర్వాత యూరప్‌లో యూజర్ల డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2023లో ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ 1.2 బిలియన్‌ యూరోల జరిమానా విధించింది. ఫేస్‌ రికగ్నిషన్‌ డేటా సేకరణ వ్యవహారంలో అమెరికాలోని టెక్సాస్‌తో 1.4 బిలియన్‌ డాలర్ల సెటిల్‌మెంట్‌, వాట్సాప్‌ ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై 225 మిలియన్‌ యూరోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల డేటా రక్షణ లోపాలపై 405 మిలియన్‌ యూరోలు వంటి భారీ జరిమానాలు ఎదురయ్యాయి. తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యం, మైనర్ల భద్రత విషయంలో అమెరికా న్యూ మెక్సికో కోర్టు విధించిన భారీ ఆర్థిక శిక్ష కూడా మెటా సంక్షోభాల జాబితాలో చేరింది. మొత్తంగా చూస్తే.. మెటా చెల్లించిన, చెల్లించాల్సి వచ్చిన జరిమానాల విలువ బిలియన్ల డాలర్లలోనే ఉంది.

ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపే వేదికగా మొదలైన ఫేస్‌బుక్‌ ప్రయాణం.. ఇప్పుడు యూజర్‌ భద్రత, గోప్యత, బాధ్యత అనే మూడు కీలక ప్రశ్నల మధ్య సాగుతోంది. ప్రతి వివాదం మార్క్‌ జుకర్‌బర్గ్‌కు మరో పరీక్షగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement