ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
తమతో ఒప్పందానికి ముందుకు రావాలని స్పష్టీకరణ
ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు ఉంటాయని వెల్లడి
ఐక్యరాజ్యసమితి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాక్షిగా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందానికి ఇకనైనా ముందుకు రాకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని, నరకానికి పంపిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ మంగళవారం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో 37 నిమిషాలపాటు ప్రసంగించారు. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని సమర్ధించారు.
ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఈ యుద్ధం నిరోధించిందని, పశ్చిమాసియాలో ఆధిపత్య శక్తిగా ఇరాన్ స్థానాన్ని అంతం చేసిందని పేర్కొన్నారు. ఇరాన్‌కు పునర్నిర్మించుకొనే అవకాశం ఇవ్వాలా?. నాశనం చెయ్యాలా అనేది తేల్చుకోవాల్సి ఉందన్నారు. లేదంటే ఇరాన్‌ను నరకంలోకి నెట్టేయాలా? అని ప్రశ్నించారు. ఒకవైపు ఇరాన్‌పై సైనిక చర్యలు తప్పవంటూనే మరోవైపు త్వరలో ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్‌లు ఒక ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ టెహ్రాన్
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగించాలని ప్రపంచ దేశాలను ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ టెహ్రాన్ అని ఆరోపించారు. ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. ఇరాన్ ఒకప్పుడు పశ్చిమాసియాపై ఆధిపత్యం చెలాయించేందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇరాన్‌పై యుద్ధం తన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయదని, మధ్యంతర ఎన్నికలలో తాను అభ్యర్ధిని కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేశానని, భారీ మెజారిటీతో గెలిచానని, మరో రెండున్నర ఏళ్లపాటు పదవిలో ఉంటానని స్పష్టంచేశారు.
ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికా కాంగ్రెస్‌పై తమ నియంత్రణను నిర్ణయిస్తాయానని చెప్పారు. మిగిలిన తన పదవీ కాలాన్ని నిర్దేశిస్తాయని వెల్లడించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను ట్రంప్ ఖండించారు. ఈ విషయంలో తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారీ మెజారిటీతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించడంలో మనం అంతే ఐక్యంగా ఉండాలని కోరారు. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధి గుండా బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును రవాణా చేసిందని పేర్కొన్నారు.
ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్
పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ కంటే కృత్రిమ మేధ పెద్ద మార్పును తీసుకురాగలదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘కృత్రిమ మేధ’అనే పదాన్ని ‘సూపర్ ఇంటెలిజెన్స్’తో భర్తీ చేయాలని అన్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో కృత్రిమ మేధకు బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ‘ఎస్‌ఐ’ని మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపారు. ‘ఇకపై అమెరికాకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరి్టఫిíÙయల్ అనే పదానికి బదులుగా సూపర్ అనే పదాన్ని ఉపయోగిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ప్రపంచానికి స్వాగతం అని వ్యాఖ్యానించారు. ఇది ఎలా సాగుతుందో చూద్దామని, వినడానికి ఇది చాలా బాగుందని చెప్పారు. అధునాతన ఏఐ సాంకేతికత కోసం జరుగుతున్న పోటీని ఒక వ్యూహాత్మక పోటీగా అభివరి్ణంచారు.
భారత్, పాక్ యుద్ధాన్ని నేనే ఆపేశా..
గత ఏడాది భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని అన్నారు. తద్వారా ఆయా దేశాల నాయకులతో స్నేహ పూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు. వీటిలో అనేక యుద్ధాలు ఎన్నో ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా కూడా కొనసాగుతూ వచ్చాయని వెల్లడించారు. వాటిని నిలిపివేసిన ఘనత తనకే దక్కిందన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి, అవసరమైతే, కొత్త చట్టం కింద తనకు లభించిన భారీ సుంకాల అధికారాలను వినియోగిస్తానని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి గైర్హాజరు
ఐరాస సాధారణ సభ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ న్యూయార్క్‌కు చేరుకున్నారు. కానీ, ట్రంప్ ప్రసంగానికి వారు హాజరు కాలేదు. జనరల్ అసెంబ్లీ హాల్‌లో ఉన్న ఇరాన్ ప్రతినిధులు ట్రంప్ ప్రసంగం ప్రారంభం కాగానే బయటకు వెళ్లిపోయారు. కేవలం ఒక్కరు మాత్రమే హాల్‌లో ఉన్నట్లు తెలిసింది.


