ఐరాస సమావేశాల వేళ.. అమెరికా ఆకాశంలో గందరగోళం | US Flights Disrupted as Key FAA Systems Fail During UN Meet | Sakshi
Sakshi News home page

ఐరాస సమావేశాల వేళ.. అమెరికా ఆకాశంలో గందరగోళం

Sep 22 2026 9:17 AM | Updated on Sep 22 2026 9:23 AM

US Flights Disrupted as Key FAA Systems Fail During UN Meet

అమెరికాలో విమాన రాకపోకలు ఒక్కసారిగా స్తంభించాయి. న్యూయార్క్‌ ప్రాంతంలోని కీలక విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దుకాగా.. వేలాది ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు చేరుకుంటున్న సమయంలోనే ఈ అంతరాయం కలగడం ఒక్కసారిగా కలకలం రేపింది.

ఈశాన్య ప్రాంతంలో ఫిలడెల్ఫియాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రంలో కీలక కమ్యూనికేషన్‌ సర్క్యూట్‌ విఫలమవడంతో ఈ సమస్య మొదలైంది. విమానాల రాకపోకలను సమన్వయం చేయడంలో కీలకమైన ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రభావం పడింది. దీంతో న్యూయార్క్‌ పరిసరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నెమ్మదించాయి. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సిన బ్యాకప్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్‌ కూడా నిర్మాణ పనుల కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన కమ్యూనికేషన్‌ సర్క్యూట్‌ విఫలమైన సమయంలో బ్యాకప్‌ లైన్‌ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఒకదాని తర్వాత ఒకటి..
ఫిలడెల్ఫియాలోని ఎఫ్‌ఏఏ కేంద్రంలో సోమవారం ఉదయం కీలక కమ్యూనికేషన్‌ సర్క్యూట్‌ పనిచేయడం ఆగిపోయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాకప్‌ వ్యవస్థ పనిచేయాలి. కానీ అధికారులు దానిని ఉపయోగించేందుకు ప్రయత్నించగా.. న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్‌విక్‌–నెవార్క్‌ మధ్య ఉన్న బ్యాకప్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్‌ కూడా నిర్మాణ పనుల సమయంలో కట్‌ అయినట్లు గుర్తించారు. దీంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కమ్యూనికేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది.

ఎఫ్‌ఏఏ అడ్మినిస్ట్రేటర్‌ బ్రయాన్‌ బెడ్‌ఫోర్డ్‌ ప్రకారం.. ఫైబర్‌ లైన్‌ను మరమ్మతు చేయడానికి సుమారు 13 గంటలు పట్టింది. మరోవైపు ప్రధాన సర్క్యూట్‌కు కొత్త లైన్‌ను ఏర్పాటు చేసే పనులు కూడా చేపట్టారు.

వేలాది విమానాలు రద్దు!
ఈ సాంకేతిక సమస్య ప్రభావం న్యూయార్క్‌లోని మూడు ప్రధాన విమానాశ్రయాలపై పడింది. జాన్‌ ఎఫ్‌. కెన్నడీ (JFK), లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం కూడా ప్రభావితమైంది. కొన్ని విమానాలను దారి మళ్లించగా.. మరికొన్నింటిని నిలిపివేశారు.

ఈ అంతరాయం కారణంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 7,000 విమానాలు ఆలస్యంగా నడవగా.. వాటిల్లో కొన్ని రద్దు అయ్యాయి. న్యూయార్క్‌ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లోనే 1,400కుపైగా విమానాలపై ప్రభావం పడింది.

మళ్లీ సాధారణ స్థితికి..
ఫైబర్‌ లైన్‌, టెలికాం కనెక్షన్ల మరమ్మతు పూర్తయ్యాక ఈశాన్య అమెరికాలో విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు అమెరికా రవాణా శాఖ తెలిపింది. అయితే అప్పటికే ఏర్పడిన రద్దులు, ఆలస్యాల ప్రభావం రోజంతా కొనసాగింది. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు అదనపు ఛార్జీలు లేకుండా టికెట్లను మార్చుకునే అవకాశం కల్పించాయి.

ఇదే సమయంలో ఎఫ్‌ఏఏ వాషింగ్టన్‌ డీసీ ప్రాంతంలో విమాన షెడ్యూల్‌ సమస్యలు, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఎయిర్‌ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఏఐ ఆధారిత కొత్త కంప్యూటర్‌ వ్యవస్థను పరీక్షించడం ప్రారంభించింది. అయితే ఈ ఏఐ వ్యవస్థకు తాజా విమాన అంతరాయంతో సంబంధం లేదని అధికారులు తెలిపారు.

యూఎన్‌ సమావేశాల వేళ.. మరింత టెన్షన్‌
న్యూయార్క్‌లో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. దాదాపు 130 మంది ప్రపంచ నేతలు, పలువురు మంత్రులు న్యూయార్క్‌కు చేరుకుంటున్న సమయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానం మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే బయలుదేరింది.

గతంలోనూ ఇదే కేంద్రం నుంచి..
ఇదే ఫిలడెల్ఫియాలోని ఎఫ్‌ఏఏ కేంద్రం కారణంగా 2025 వసంతకాలంలో కూడా నెవార్క్‌ విమానాశ్రయంలో పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో అమెరికా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలోని పాత కమ్యూనికేషన్‌ మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. తాజా ఘటనలో మాత్రం ప్రధాన సర్క్యూట్‌ విఫలమవడంతో పాటు బ్యాకప్‌ లైన్‌ కూడా అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.

ఇదీ చదవండి: హౌతీలంటే ట్రంప్‌కు ఎందుకంత భయం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement