విధి నిర్వహణ అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) మహిళా ఉద్యోగి తిరిగి రాని లోకాలకు తరలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముంబైలో పని ముగించుకుని క్యాబ్‌లో తిరిగి వస్తుండగా జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. ఈ ప్రమాదం సెప్టెంబర్ 18న బోరివాలి ఈస్ట్‌లోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది.
ముంబైలోని మీరా రోడ్ నివాసి,ముప్పై రెండేళ్ల కైనూర్ మిస్త్రీ, కంపెనీ అందించిన క్యాబ్‌లో తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారువంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక సీటులో కూర్చున్న మిస్త్రీకి తలకు తీవ్ర గాయం అయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మిస్త్రీకి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
క్యాబ్ డ్రైవర్ విజయ్ ఖోస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేసినప్పటికీ కైనూర్ మిస్త్రీ మృతి నేపథ్యంలో, నిర్లక్ష్యం కారణంగా జరిగిన మరణంపై కింద కేసు నమోదు చేశారు.ఇండిగో తన ఉద్యోగుల రవాణా కోసం 'మయూరేష్ టూర్ అండ్ ట్రావెల్స్' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులకు కల్పించే రవాణా సౌకర్యాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత, ప్రముఖుల సంతాపం


