బెంగళూరులో ఇళ్లకు ఇదేం ఛార్జీ!! కొత్త రుసుముపై దుమారం | Bengaluru Property Tax New Software Charge Rs 200, Rs 1000 | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఇళ్లకు ఇదేం ఛార్జీ!! కొత్త రుసుముపై దుమారం

Sep 21 2026 3:36 PM | Updated on Sep 21 2026 4:31 PM

Bengaluru Property Tax New Software Charge Rs 200, Rs 1000

బెంగళూరులో ఇళ్లకు విధిస్తున్న కొత్త రుసుముపై దుమారం రేగుతోంది. ఆస్తి పన్ను చెల్లించే వారికి కొత్తగా ‘సాఫ్ట్‌వేర్ ఛార్జీ’ కనిపిస్తోంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలోని ఐదు నగర కార్పొరేషన్లు ఆస్తి పన్ను సంబంధిత ఆన్‌లైన్ సేవలకు ఈ అదనపు రుసుమును వసూలు చేస్తున్నాయి. నివాస ఆస్తులకు ఏడాదికి రూ.200, వాణిజ్య, వసతియేతర, మిశ్రమ వినియోగ ఆస్తులకు రూ.1,000 చొప్పున ఈ ఛార్జీని నిర్ణయించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ రుసుము ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్ను డిమాండ్‌లో కనిపించడం, దీనిపై ముందస్తు స్పష్టమైన ప్రజా ప్రకటన లేకపోవడం చర్చకు దారితీసింది.

గ్రేటర్ బెంగళూరు అథారిటీ ప్రత్యేక కమిషనర్‌ (రెవెన్యూ, ఐటీ) మునీష్‌ మౌద్గిల్‌ మాత్రం ఈ ఛార్జీని సమర్థించారు. ఆస్తి పన్ను వసూళ్లు, ఈ-ఖాతా వంటి పౌర సేవలకు ఉపయోగిస్తున్న డిజిటల్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, నిర్వహించడం, అప్‌గ్రేడ్‌ చేయడం, డేటా భద్రత వంటి వాటికి నిరంతరం ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీకి ఈ ఐటీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక ఆదాయ వనరు లేకపోవడంతో ‘యూజర్‌ పేస్‌’ విధానంలో ఈ రుసుమును విధించినట్లు వివరణ ఇచ్చారు. ఆన్‌లైన్‌ సేవల ద్వారా సమయం, సౌలభ్యం లభిస్తున్న నేపథ్యంలో నివాస ఆస్తికి ఏడాదికి రూ.200 తక్కువ మొత్తమేనని అధికారులు పేర్కొన్నారు.

అయితే, కొత్త ఛార్జీపై ప్రాపర్టీ యజమానులు, పౌర సంఘాలు, ప్రతిపక్ష నాయకుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఆస్తి పన్నులోనే పౌర సేవల నిర్వహణ ఖర్చులు భాగమై ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎందుకు వసూలు చేస్తున్నారనే ప్రశ్నతో పాటు, రూ.200, రూ.1,000 మొత్తాలను ఎలా నిర్ణయించారు? వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? ఏ చట్టపరమైన నిబంధన ఆధారంగా ఈ రుసుమును విధించారు? అనే అంశాలపై స్పష్టత కోరుతున్నారు.

ఈ కొత్త ఫీజు నిర్మాణం ఆస్తి పన్నుకే పరిమితం కాలేదు. తాజా నివేదికల ప్రకారం ఈ-ఖాతా ఫైనల్‌ ప్రాసెసింగ్‌కు రూ.400, బీ-ఖాతా నుంచి ఏ-ఖాతాకు మార్పిడికి నివాస ఆస్తులకు రూ.2,000, వసతియేతర ఆస్తులకు రూ.10,000 వంటి సాఫ్ట్‌వేర్‌ సంబంధిత ఛార్జీలు కూడా ఉన్నాయి. లేఅవుట్‌ ఖాతా, కొత్త ఖాతా నమోదు, ఈ-ఖాతా పత్రాల పునర్ముద్రణ వంటి కొన్ని సేవలకు కూడా వేర్వేరు రుసుములు నిర్ణయించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: చిన్న నగరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement