కొండచరియలు విరిగి షాక్
అబ్జార్బర్‌ను ఢీకొన్న బండరాయి
సాక్షి, చెన్నై: నాగర్‌కోయిల్–బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలుకు ఆదివారం ఉదయం పెను ప్రమా దం తప్పింది. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ముత్తంపట్టి–శివాడి స్టేషన్ల మధ్య ఉన్న పర్వత మార్గంలో బెంగళూరుకు ప్రయాణిస్తుండగా కొండచరియల నుండి దొర్లుకుంటూ వచ్చిన ఒక బండరాయి ఇంజన్ భాగంలో రైలు చక్రాల వద్ద ఉన్న షాక్ అబ్జార్బర్‌ను బలంగా ఢీకొట్టింది. భారీ శబ్దం వచ్చిన వెంటనే డ్రైవర్ బ్రేక్ వేశాడు. రైలు వేగం తక్కువగా ఉండడం, డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. వేకువజామున కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి ట్రాక్‌పైకి బండ రాయి దొర్లుకొచ్చిందని సమాచారం.
కాగా, దెబ్బతిన్న రైలును వెంటనే సమీపంలోని ధర్మపురి స్టేషన్‌కు తరలించారు. సాంకేతిక నిపుణులు దెబ్బతిన్న భాగాలకు మరమ్మతు చేయడంతో, రైలు అరగంట ఆలస్యంగా బెంగళూరుకు బయలుదేరింది. కొండల మధ్య ఉన్న ఈ రైల్వే లైన్‌లో వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడకుండా మూడు అంచెల వైర్ మెష్ (రక్షణ కంచె) నిర్మించే పనులు జరుగుతున్నాయి. రాయి పడిన ప్రాంతంలో కంచె లేకపోవడం ఘటనకు కారణం. ధర్మపురి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


