ఇండోర్: ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశంలోని నదులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో గణపయ్యల నిమజ్జనం పెద్ద సవాల్‌గా నిలిచింది. ఎండిపోయిన నీటి వనరుల్లో గణపతి విగ్రహాలను వేయాల్సిరావడం పలువురిలో ఆవేదన కలిగిస్తున్నది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కొర్పొరేషన్ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. గణేశ్ నిమజ్జనానికి సంబంధించి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఐఎంసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నగరవ్యాప్తంగా ప్రజల నుంచి నిమజ్జనానికి సిద్ధమైన గణేశ్ విగ్రహాలను సేకరించేందుకు 100కుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
సేకరించిన గణేశ్ విగ్రహాలను సంప్రదాయ ఆచారాల ప్రకారం సెప్టెంబర్ 25, 26 తేదీల్లో మున్సిపల్ అధికారులు నిమజ్జనం చేయనున్నారు. ధార్ రోడ్డులోని జవహర్ టేక్రి క్వారీలో వర్షపు నీటితో ఏర్పడిన జలాశయంలో ఈ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినకుండా నిమజ్జనం నిర్వహణకు ఐఎంసీ ఇంజినీర్లు ప్రత్యేక హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. విగ్రహాలను ఈ ప్లాట్‌ఫామ్‌పై ఉంచి యాంత్రిక విధానంలో వాటిని నీటిలోకి దించనున్నారు.
అనంతరం నియంత్రిత ఓపెనింగ్ వ్యవస్థ ద్వారా విగ్రహాలు నీటి ఉపరితలం కిందకు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ద్వారా విగ్రహాలను నేరుగా చేతులతో నీటిలోకి దించే అవసరం ఉండదని అధికారులు తెలిపారు. మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా భారీ శోభాయాత్రలు జరిగే అవకాశం ఉండటంతో నగరంలోని ఏడు కిలోమీటర్ల ఊరేగింపు మార్గంలో రోడ్ల పునరుద్ధరణ, నిర్వహణ పనులను అధికారులు వేగవంతం చేశారు.
ఇదీ చదవండి: ఏఐతో వైద్యరంగం గందరగోళం.. సమస్య ఎక్కడుంది?


