ముంబై: ముంబైలో గణేశోత్సవం అంటే భారీ విగ్రహాలు, వైభవంగా కనిపించే అలంకరణలు, లక్షలాది భక్తుల సందడే గుర్తుకొస్తుంది. అయితే ఈ వేడుకల మూలాలు మాత్రం నిశ్శబ్దంగా సాగే సామాజిక ఉత్సవాల్లో ఉన్నాయి. నగరంలోని వందేళ్లకు పైబడిన కొన్ని గణేశ మండపాలు ఇప్పటికీ తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలు, సంప్రదాయ పూజలు, కుటుంబసభ్యులు, స్థానికులతో కలసి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ముంబైలో వందేళ్ల చరిత్ర కలిగిన 32 గణేశ మండపాలు ఉన్నాయని, వాటిలో 24 గిర్‌గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయని నగరంలో పర్యటనలు నిర్వహించే ‘ఖాకీ టూర్స్’ తెలిపింది.
గిర్‌గావ్‌లోని వీపీ రోడ్డులో ఉన్న 105 ఏళ్ల అంగ్రేవాడి గణేశోత్సవ మండల్‌లో ఈసారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. నితిన్ గాడ్రే, స్వాతి జోషి అనే ఇద్దరు స్థానికులు గత నెల కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల అనంతరం వారు గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవారని కమిటీ సభ్యుడు మిలింద్ పోంక్షే తెలిపారు.
అంగ్రేవాడిలో గతంలో సుమారు 100 మరాఠీ కుటుంబాలు గణేశోత్సవంలో పాల్గొనేవి. 1971లో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో నాటకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంత్ర పఠనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 30-40 మరాఠీ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ 2.5 అడుగుల విగ్రహంతో 10 రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 8-10 మంది పూజారులు మంత్ర పఠనం, హారతి నిర్వహిస్తున్నారు. గణేశుడికి సంస్కృత స్తుతితోపాటు ప్రసాదంగా ఉసల్ తయారు చేసే సంప్రదాయం కొనసాగుతోంది.
ఖాదిల్‌కర్ రోడ్డులోని కేశవ్‌జీ నాయక్ చాల్‌లోని శ్రీ సార్వజనిక గణేశోత్సవ సంస్థ 133వ ఏడాదిని జరుపుకొంటోంది. 1901లో లోకమాన్య తిలక్ ఈ చాల్‌ను సందర్శించి అక్కడ ఆతిథ్యం స్వీకరించినట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇక్కడ రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి, లౌడ్‌స్పీకర్లు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనే పరిమితమైన గణేశోత్సవాన్ని స్వాతంత్య్ర యోధుడు తిలక్ ప్రజా ఉద్యమంగా మార్చారు. బ్రిటిష్ పాలనలో రాజకీయ సమావేశాలపై ఆంక్షలు విధించిన సమయంలో, ప్రజలను ఒకచోట చేర్చేందుకు, స్వరాజ్య సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు.
కింగ్స్ సర్కిల్‌లో 1925లో ఏర్పడిన దక్షిణీ బ్రాహ్మణవాడి మండల్ రెండు రోజుల గణపతి ఉత్సవాన్ని నిర్వహించింది. స్థానికుల నుంచి కొద్దికొద్దిగా ధాన్యం సేకరించి, మహాప్రసాదం ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం. వివాహం అనంతరం ఈ ప్రాంతం విడిచి వెళ్లిన మహిళలు సైతం పూజల్లో పాల్గొనేందుకు ఇక్కడికి తిరిగి వస్తుంటారు. మరాఠీ నాటకాలు, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.
ఇదీ చదవండి: 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక?


