అన్‌రిజిస్టర్డ్ సంస్థలతో ముప్పు!
కేంద్రాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది
పిటిషనర్ వాదన
న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు మతపరమైన, సాధారణ విద్యనందించే సంస్థల నియంత్రణ విషయంలో ఆదేశాలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానమివ్వాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్‌నాగూలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్ తానిచ్చిన విజ్ఞప్తిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సవాలు చేయడంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వానికి తన విజ్ఞప్తిని సమర్పించాలని సుప్రీంకోర్టు మే 11వ తేదీ ఉపాధ్యాయ్‌కు సూచించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
న్యాయవాది అశ్వినీ దూబే ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌లో ‘‘14 ఏళ్ల లోపు పిల్లలకు మత సామరస్య, మతపరమైన సూచనలిచ్చే ప్రతి విద్యాసంస్థ రిజిస్టర్ అయ్యేలా, గుర్తింపు కలిగి ఉండేలా, పర్యవేక్షణ, నిఘాలకు అనుకూలంగా ఉండేలా కేంద్రం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి’’ అని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక్ 21ఏ, ఆర్టిక్ 39(ఎఫ్), 45, 51–ఏ(కే)ల స్ఫూర్తితో ఈ చర్యలు తీసుకోవాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనార్టీలకు ఎలాంటి ప్రత్యేక, అదనపు హక్కులు కల్పించవని, ఆర్టికల్ 19(1)(జీ) కింద ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వాణిజ్యాల్లో స్వేచ్ఛ మాత్రమే లభిస్తుందని పిటిషనర్ వాదించారు.
‘‘ఆర్టికల్ 30 అనేది ఆర్టికల్ 19 (1)(జీ) పునరుద్ఘాటన అని ప్రకటించాలని, దానిద్వారా ప్రత్యేక, అదనపు హక్కులు, ప్రయోజనాలు, ప్రత్యేతలు లభించవని ఆదేశించేలా చేయాలి’’ అని కోరింది. ‘‘పిల్లలు ఈ దేశానికి వెన్నెముక అని పిటిషనర్ గుర్తిస్తున్నారు. వారి లేత వయసు కారణంగా తొందరగా ప్రభావితమయ్యే అవకాశమూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి వారిపట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. రిజిస్టర్ కాని విద్యా సంస్థలు దేశ భవిష్యత్తు అయిన పిల్లల మెదళ్లను తప్పుదోవ పట్టించేందుకు, నియంత్రించేందుకు అవకాశాలు ఉంటాయి’’ అని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదరేశ్ సరిహద్దు జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటించానని, అక్కడ రిజిస్టర్ కానీ, గుర్తింపులేని సంస్థలు అనేకం నడుస్తున్నాయని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో తెలిపారు. ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణల్లేకుండా ఈ సంస్థలు లాభాలు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు మే నెల 11న కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అయితే కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ్ మళ్లీ ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.


