వినాయక చవితి.. పత్రి | Kids Story: Vinayaka Chavithi Patri | Sakshi
Sakshi News home page

వినాయక చవితి.. పత్రి

Sep 12 2026 5:38 PM | Updated on Sep 12 2026 5:49 PM

Kids Story: Vinayaka Chavithi Patri

ఏఐ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

పిల్లల కథ

‘చిన్నమ్మా! ఇటు చూడు.. వినాయకుడి పూజ కోసం మామిడి ఆకులు, జమ్మి ఆకులు, గరికపోచలు అన్నీ తెచ్చాను. కానీ స్వామివారికి ఇన్ని రకాల ఆకులు ఎందుకు పెడతాం?’ అని అడిగాడు పదేళ్ల కన్నయ్య. చేతిలో బుజ్జి మట్టి వినాయకుడిని పట్టుకుని పూజా గదిలోకి వస్తూ.

ఎనిమిదేళ్ల చిన్నమ్మ ఆ ఆకులను గమనిస్తూ ‘అవును కన్నయ్యా.. పండ్లు, పూలు పెడితే 
సరిపోతుంది కదా, ఈ పత్రి ఎందుకు?’ అని తల గోక్కుంది.

అంతలోనే వేణు అన్న చేతిలో పూజా సాగ్రితో అక్కడికి వచ్చాడు. ‘పిల్లలూ!  వినాయక చవితి రోజు మనం చేసే ఈ ‘పత్రి పూజ’ వెనుక ఒక సైన్స్‌ రహస్యం ఉందమ్మ‘ అన్నాడు నవ్వుతూ.

‘సైన్సా? ఆకుల్లో సైన్స్‌ ఏముంటుంది వేణు అన్నా?‘ అని కన్నయ్య, చిన్నమ్మ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు.

ఇదీ చ‌ద‌వండి: ‘ఫెన్సింగ్‌’ ఆట ఎలా ఆడ‌తారో తెలుసా?

‘వినాయక చవితి వచ్చేది వర్షాకాలంలో. ఈ టైమ్‌లో గాలిలో తేమ వల్ల మనకు తెలియకుండానే జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే మన పెద్దవాళ్లు ఈ పండుగ రోజున ఏకంగా 21 రకాల ప్రత్యేకమైన ఔషధ ఆకులతో పూజ చేయాలని రూల్‌ పెట్టారు. మనం పూజకు వాడే మాచిపత్రం, జమ్మి, ఉత్తరేణి, మారేడు, ఉసిరి, గరికపోచలు.. ఇవన్నీ కేవలం ఆకులు కావు, గొప్ప ఆయుర్వేద మందులు! పూజ చేసేటప్పుడు, ఆ తర్వాత ఈ ఆకులన్నీ ఇంట్లో ఉండటం వల్ల వాటి నుంచి వచ్చే సువాసన గాల్లోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. మనకు స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఆ తర్వాత ఈ పత్రినంతటినీ తీసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేసినప్పుడు, ఆ నీరు కూడా శుద్ధి అవుతుంది. అంటే వినాయకుడు మనకు చదువులతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడన్నమాట’ అన్నాడు వేణు అన్న.

‘వావ్‌! అంటే మన పత్రి ఒక సూపర్‌ డాక్టర్‌ అన్నమాట’ అని కన్నయ్య చప్పట్లు కొట్టాడు.

చిన్నమ్మ సంతోషంగా ఆ 21 రకాల ఆకులను ఎంతో గౌరవంగా బుజ్జి గణపయ్య పాదాల దగ్గర పెట్టి పూజ చేసింది. వినాయక చవితి అంటే కేవలం లడ్డూలు తినడమే కాదు ప్రకృతిని ప్రేమించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని కన్నయ్య, చిన్నమ్మలకు ఆ రోజు అర్థమైంది!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement