మూడ్‌ బాలేదా?.. మనసు విరిగిందా?.. ఏఐ జోలికి పోకూడదా? | Feeling Low or Heartbroken: Think Twice Before Turning to AI | Sakshi
Sakshi News home page

మూడ్‌ బాలేదా?.. మనసు విరిగిందా?.. ఏఐ జోలికి పోకూడదా?

Sep 12 2026 8:14 AM | Updated on Sep 12 2026 8:48 AM

Feeling Low or Heartbroken: Think Twice Before Turning to AI

ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా సందేహం వస్తే ఏఐని అడుగుతున్నారు.. ఎడాపెడా ఫోటోలు, వీడియోలు జనరేట్‌ చేసుకుంటున్నారు.. చివరికి మూడ్‌ బాగోలేకపోయినా తమ మనసులోని మాటలను ఏఐ చాట్‌బాట్‌ ముందు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ అలవాటు క్రమంగా పెరుగుతోంది. అయితే.. మనసు బరువుగా ఉన్నప్పుడు అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీతో మాట్లాడటం కూడా అంత సింపుల్‌ విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మనిషితో మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఆలోచిస్తాం. మన సమస్య చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో.. మనల్ని బలహీనంగా భావిస్తారో.. మన బాధను అర్థం చేసుకుంటారో లేదోనన్న సందేహం ఉంటుంది. ఏఐ విషయంలో మాత్రం అలాంటి సంకోచం ఉండదు. ఎప్పుడు మెసేజ్‌ చేసినా వెంటనే స్పందిస్తుంది. పైగా తీర్పు చెప్పడం లేదన్న భావన కలుగుతుంది. అందుకే బాధ, ఒంటరితనం, ఆందోళన వంటి విషయాలను కూడా ఏఐతో పంచుకోవడం కొందరికి సులభంగా మారుతోంది.

యువతలో పెరుగుతున్న వినియోగం
తాజాగా.. 12–21 ఏళ్ల వయసున్న వాళ్లపై నిర్వహించిన సర్వేలో ఈ ధోరణి ఎంతవరకు పెరిగిందో వెల్లడైంది. జామా పెడియాట్రిక్స్‌ (JAMA Pediatrics)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 2025లో 19.2 శాతం మంది మానసిక ఆరోగ్య సలహాల కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించారు. వీరిలో దాదాపు 43 శాతం మంది కనీసం నెలకోసారి ఏఐని ఆశ్రయించగా.. 5.8 శాతం మంది రోజూ లేదా దాదాపు ప్రతిరోజూ ఉపయోగించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏఐతో మానసిక ఆరోగ్యంపై మాట్లాడుతున్న విషయాన్ని దాదాపు మూడింట రెండొంతుల మంది మరెవరికీ చెప్పలేదు.

సమస్య ఎక్కడ వస్తుంది?
సాధారణంగా మూడ్‌ బాగోలేకపోయినప్పుడు ఏఐతో మాట్లాడటం వల్ల తప్పనిసరిగా హాని జరుగుతుందని చెప్పలేం. మానసిక ఆరోగ్యంపై సాధారణ సమాచారం తెలుసుకోవడం, రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొనే కొన్ని మార్గాలు తెలుసుకోవడం వంటి వాటికి ఏఐ ఉపయోగపడొచ్చు. కానీ పరిస్థితి తీవ్రమైనప్పుడు మాత్రం సమస్య మొదలవుతుంది.

తీవ్రమైన నిస్సహాయత, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు వంటి మానసిక సంక్షోభాల్లో ఏఐ ఇచ్చే స్పందనకు పరిమితులు ఉంటాయి. ఏఐ సానుభూతితో స్పందిస్తున్నట్లు అనిపించినా.. అది మనిషి భావోద్వేగ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేదు. అత్యవసర పరిస్థితిని గుర్తించి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం, అవసరమైన చికిత్స లేదంటే సహాయాన్ని వెంటనే అందించడం దాని వల్ల సాధ్యం కాదు.

సానుభూతి మాత్రమే సరిపోదు!
నిపుణుల ఆందోళనకు మరో కారణం ఉంది. ఇప్పటికే ప్రతికూల ఆలోచనల్లో చిక్కుకున్న వ్యక్తికి ఏఐ స్పందన ఎప్పుడూ సరైన దిశలోనే తీసుకెళ్తుందని హామీ లేదు. కొన్ని సందర్భాల్లో అది నిస్సహాయతను మరింత బలపరచడం, అదే విషయంపై పదేపదే ఆలోచించేలా చేయడం లేదా నిజ జీవితంలో సహాయం కోరడాన్ని ఆలస్యం చేయడం వంటి సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ వాడండి.. కానీ మనుషుల్ని మర్చిపోవద్దు
మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకు ఏఐ సమాధానం కాదు. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, కౌన్సిలర్‌ లేదంటే మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటానికి అది ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన మానసిక సంక్షోభం ఎదురైనప్పుడు ఏఐతోనే సంభాషణ కొనసాగించకుండా.. వెంటనే నమ్మకమైన వ్యక్తిని సంప్రదించడం, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

బోర్‌ కొడితే ఏఐతో మాట్లాడొచ్చు.. సందేహం వస్తే ఏఐని అడగొచ్చు. ఫొటోలు క్రియేట్‌ చేసుకోవచ్చు. కానీ మనసు కుంగిపోయినప్పుడు మాత్రం ఏఐ ఒక్కటే మనకు తోడుగా మారకూడదు. కొన్ని సందర్భాల్లో ఒక మనిషి పలికే మాట.. ఏఐ ఇచ్చే వంద సమాధానాల కంటే విలువైనదై ఉండొచ్చు.

ఇదీ చదవండి: బ్రష్‌ చేశాక కూడా దుర్వాసన వస్తోందా? అయితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement