ఐదు రోజుల్లో రిటైర్మెంట్‌.. ఇంతలో కలెక్టర్‌కు బిగ్‌ షాక్‌! | Haryana IAS Suresh faces corruption FIR 5 days before retirement | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల్లో రిటైర్మెంట్‌.. ఇంతలో కలెక్టర్‌కు బిగ్‌ షాక్‌!

Sep 12 2026 7:26 AM | Updated on Sep 12 2026 7:26 AM

Haryana IAS Suresh faces corruption FIR 5 days before retirement

సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ.. ఆయనపై అవినీతి కేసు నమోదవడం సంచలనంగా మారింది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ మొత్తానికే బదలాయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలతో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీంతో, ఈ ఘటన సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

హర్యానా పరిపాలనా వర్గాల్లో సంచలనం రేపిన భూ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డి. సురేశ్‌పై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) కేసు నమోదు చేసింది. ఆయన రిటైర్మెంట్‌కు కేవలం ఐదు రోజుల ముందు.. ఆగస్టు 26న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రధాన కార్యదర్శి అనుమతితో నమోదైన ఈ కేసులో 1995 బ్యాచ్‌కు చెందిన డి. సురేశ్‌తో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు ప్రధాన కార్యదర్శి అనుమతి లభించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సురేశ్‌ ఆగస్టు 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అందుకు కేవలం ఐదు రోజుల ముందు కేసు నమోదు కావడం మరింత చర్చకు దారితీసింది.

కాగా, గురుగ్రామ్‌ సెక్టార్‌-23లోని 500 చదరపు గజాల HSVP స్థలానికి సంబంధించిన వ్యవహారమే ఈ కేసుకు కేంద్రంగా మారింది. ఈ ప్లాట్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ.3.5 కోట్లు కాగా.. కలెక్టర్‌ రేటు ప్రకారం దాని విలువ దాదాపు రూ.1.75 కోట్లు ఉంటుందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఆ స్థలాన్ని కేవలం రూ.6.71 లక్షలకే బదలాయించినట్లు అవినీతి నిరోధక శాఖ ఆరోపించింది. 1988లో కేటాయించిన ఈ ప్లాట్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో 2002లో HSVP దానిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అనంతరం దాదాపు ఏడేళ్లపాటు సాగిన విజిలెన్స్‌ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. మరో ప్లాట్‌ పునరుద్ధరణకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులను ఉపయోగించి నకిలీ నోట్‌షీట్లను అధికారులు, సిబ్బంది సిద్ధం చేశారన్నది ప్రధాన ఆరోపణ.

2019 మార్చిలో HSVP చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న డి. సురేశ్‌.. డిఫాల్ట్‌ అయిన ప్లాట్‌ పునఃస్వాధీన నిర్ణయాన్ని రద్దు చేశారని, అనంతరం అత్యంత తక్కువ విలువకు కన్వేయన్స్‌ డీడ్‌ అమలు జరిగేలా సహకరించారని ఏసీబీ ఆరోపించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పటి ఎస్టేట్‌ అధికారి ముకేశ్‌ కుమార్‌తో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు పెట్టారు. అయితే ఈ వ్యవహారంలో సురేశ్‌కు పంజాబ్‌-హర్యానా హైకోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. తనను అరెస్టు చేసే ముందు కనీసం ఏడు రోజుల నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 16న జరగనుంది.

ఇదీ చదవండి: యూపీ రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement