న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు.
సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్‌లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు.


