మెనూలో సిరిధాన్యాల వంటకాలకు పెద్దపీట
హైదరాబాదీ బిర్యానీ, కశ్మీరీ పులావ్‌లకు చోటు
అతిథుల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ప్రత్యేక కిచెన్లు
కట్టుదిట్టంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నాణ్యత తనిఖీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు, విశిష్ట అతిథులకు భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించేందుకు కేంద్ర ప్రభుత్వం, నగరంలోని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల అభిరుచులకు అనుగుణంగా ఆహార మెనూను రూపొందించాయి. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ దేశీ, విదేశీ రుచుల కలయికతో వంటకాలను సిద్ధం చేస్తున్నాయి.
సిరిధాన్యాలతో వంటకాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న సిరిధాన్యాలతో (బాజ్రా, జొన్న, రాగి) కూడిన వంటకాలకు మెనూలో ప్రత్యేక స్థానం కల్పించారు. రాగి దోశ, బాజ్రా ఉప్మా, మిల్లెట్ పొంగల్‌తో పాటు సీజనల్ పండ్లు, కొబ్బరి నీళ్లు, తాజా మజ్జిగను అల్పాహారంగా అందించనున్నారు. మధ్యాహ్న భోజనంలో గుజరాతీ, రాజస్తానీ, దక్షిణ భారతీయ థాలీలను ఏర్పాటు చేశారు. కశ్మీరీ పులావ్, దక్కనీ తడ్కా, హైదరాబాదీ వెజ్, నాన్‌వెజ్ బిర్యానీ, సౌత్ ఇండియన్ సాంబార్ ఈ మెనూలో ఉన్నాయి. విదేశీ ప్రతినిధుల డైట్‌ను దృష్టిలో ఉంచుకుని నూనె, మసాలాలు లేని కస్టమైజ్డ్ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ కోసం లైవ్ కుకింగ్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉంచారు.
జైశంకర్ ఆధ్వర్యంలో ‘దేశ్ కీ థాలీ’
బ్రిక్స్ సదస్సు జరుగునన్న ‘భారత్ మండపం’లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశీ ప్రతినిధులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన నలభీములు ‘దేశ్ కీ థాలీ’ని సిద్ధం చేయబోతున్నారు. దేశాధినేతల కోసం లక్నోవీ కబాబ్, తందూరీ వంటకాలు, స్లో కుక్డ్ గ్రేవీ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. వారి మతపరమైన ప్రాధాన్యతలు, వ్యక్తిగత అభిరుచులను దృష్టిలో పెట్టుకొని శాకాహార, మాంసాహార వంటకాల తయారీ కోసం వేర్వేరు సెక్షన్లు, ప్రత్యేక కిచెన్లను ఏర్పాటు చేశారు.
ల్యాబ్‌లో ఆహార పదార్థాల పరీక్షలు
బ్రిక్స్ సదస్సులో అతిథులకు వడ్డించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై భారత ఆహార భద్రత, నాణ్యాతా ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పకడ్బందీ చర్యలు చేపట్టింది. హోటళ్లలో వంటలకు వాడే ముడిసరుకులు, సుగంధ ద్రవ్యాలు, బేకరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. అతిథులకు వడ్డించే ముందు ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, మైక్రోబయాలజిస్టులను నియమించారు.
ఐదు నక్షత్రాల హోటళ్లలో బస
సదస్సుకు హాజరవుతున్న అతిథుల బస కోసం ఢిల్లీలోని ల్యుటియెన్స్‌లో ఉన్న తాజ్‌మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ఐటీసీ మౌర్య, ద లీలా ప్యాలెస్, ద ఒబెరాయ్, షాంగ్రిలా, ద లలిత్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లలో వీవీఐపీ బ్లాక్‌లను కేటాయించారు. రష్యా, చైనా, యూఏఈ, దక్షిణాఫ్రికా తదితర దేశాల ప్రభుత్వ, వ్యాపార ప్రతినిధులకు ద లలిత్ హోటల్‌లో బస కల్పించారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలకు ఐటీసీ మౌర్య, తాజ్‌మహల్, ద లీలా ప్యాలెస్ హోటళ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


