2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు..  | PM Modi, Putin discuss 100 dollars billion India-Russia trade target | Sakshi
Sakshi News home page

2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు.. 

Sep 12 2026 5:16 AM | Updated on Sep 12 2026 5:16 AM

PM Modi, Putin discuss 100 dollars billion India-Russia trade target

వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయాలని భారత్, రష్యా నిర్ణయం  

ఢిల్లీలో మోదీ, పుతిన్‌ ద్వైపాక్షిక సమావేశం  

కీలక రంగాల్లో కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయం  

ఉక్రెయిన్‌–రష్యా శాంతి యత్నాలకు మద్దతిస్తామన్న మోదీ  

వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలని మోదీకి పుతిన్‌ ఆహ్వానం  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌–రష్యా సంఘర్షణను ముగించడానికి చేపట్టే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతు ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నల్ల సముద్రంలోని భారతీయ నావికుల తగిన భద్రతకు కల్పింంచాలని రష్యా అధినేత పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 

బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు పుతిన్‌ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం భారత్‌ మండపంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 45 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. భారత్, రష్యా సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సైతం సమీక్షించారు. 

ప్రస్తుతం 65 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ఈ సందర్భంగా భారత్, రష్యాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌–రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో వేగం పెంచాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించింది.

 రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలన్న పుతిన్‌ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని తెలియజేసింది.  చర్చలు, దౌత్యమే సరైన మార్గం  రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, పౌర అణు శక్తి, ఎరువుల సరఫరా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్‌ నిర్ణయించారు. 

పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రత సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య బదిలీ సహా ప్రజల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని పుతిన్‌ దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిసింది. శాంతి ప్రయత్నాలకు భారత్‌ ఎల్లవేళలా సహకరిస్తుందని మోదీ అన్నారు.  

రష్యా మార్కెట్‌లో అవకాశాలు  
ఇప్పటికే బలంగా ఉన్న తమ రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుపక్షాలు లోతుగా చర్చించాయి. ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాకుండా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం, రైలు, సొరంగ మార్గాల నిర్మాణాల్లో కలిసి పనిచేయడం, ఉక్కు సప్లై చైన్లను అభివృద్ధి చేయడం, భారతీయ ఎగుమతిదారులకు రష్యా మార్కెట్‌లో అవకాశాలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి.

 మోదీ, పుతిన్‌ కలుసుకోవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత్‌ మండపంలో బిజినెస్‌ ఫోరమ్‌ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీ, పుతిన్‌ ఒకే కారులో ప్రయాణించారు. అంతకుముందు వారిద్దరూ భారత్‌ మండపంలో ‘ఇన్నోప్రోమ్‌ ఇండియా’ప్రదర్శనను సందర్శించారు. అందులో పాల్గొన్న వారితో సంభాషించారు.  

పరస్పర సహకారంపై చర్చించా: మోదీ  
మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారంపై పుతిన్‌తో చర్చించానని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం–2030’అమలు సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు పేర్కొన్నారు.  

పుతిన్‌కు ‘తిరుక్కురళ్‌’బహూకరణ  
ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ రచించిన ప్రాచీన తమిళ కావ్య సంకలనం ‘తిరుక్కురళ్‌’రష్యన్‌ అనువాద గ్రంథాన్ని ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్‌కు బహూకరించారు. అనేక అంశాలపై జ్ఞానోపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషలు, సరిహద్దులకు అతీతంగా శాశ్వత జ్ఞానాన్ని అందించే తిరుక్కురళ్‌ రష్యన్‌ అనువాదాన్ని పుతిన్‌కు అందజేశానంటూ మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. పుతిన్‌తో ఆప్యాయంగా కరచాలనం చేసిన దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా షేర్‌చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement