సమష్టి స్వరం సాధ్యమేనా! | BRICS summit is going to be held in New Delhi on Saturday and Sunday | Sakshi
Sakshi News home page

సమష్టి స్వరం సాధ్యమేనా!

Sep 12 2026 12:37 AM | Updated on Sep 12 2026 12:37 AM

BRICS summit is going to be held in New Delhi on Saturday and Sunday

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా లడాయి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు వగైరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఊపిరాడకుండా చేస్తున్న తరుణంలో న్యూఢిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్‌ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ రాగా... చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్‌ శనివారం చేరుకుంటారు. ఆయన ఏడేళ్ల తర్వాత మన దేశం వస్తున్నారు. ఇక ఇరాన్‌ అధ్యక్షుడొకరు భారత్‌కొచ్చి ఎనిమిదేళ్లవుతుండగా, పెజెష్కియాన్‌ అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్‌ ద్వైపాక్షిక సమావేశం జరగటం,ఆ వెంటనే పెజెష్కియాన్‌ కూడా ఆయనతో ద్వైపాక్షిక భేటీ కావటంతో పాటు, తదనంతరం జరిగిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం సమావేశంలో కూడా పాలుపంచుకోవటంతో దౌత్య సందడి ముందే మొదలైనట్టయింది. 

ఆవిర్భవించిననాడు బ్రిక్స్‌వి బుడి బుడి అడుగులే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాల విదేశాంగమంత్రులు 2006లో తొలిసారి సమావేశమై కూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. 2009లో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. దక్షిణాఫ్రికా 2011లో చేరాక చివరిలో ‘ఎస్‌’ చేరి బ్రిక్స్‌ అయింది. అటుపై వరసగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండొనేసియాలు వేర్వేరు సంవత్సరాల్లో చేతులు కలిపాయి. మొత్తంగా ఇది 20 దేశాల కూటమిగా రూపొందింది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్‌ దేశాల వాటా 49.5 శాతం. ప్రపంచంలోని నాలుగోవంతు భూభాగం దీని సొంతం. ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం వాటా. 

వాణిజ్య ఎగుమతుల్లో 21.6 శాతం, దిగుమతుల్లో 17.3 శాతం వాటా ఈ దేశాలదే. ప్రపంచ ఇంధన ఉత్పత్తిలో బ్రిక్స్‌ వాటా 40 శాతం. కొనుగోలు శక్తిలో జీ7 దేశాలకన్నా బ్రిక్స్‌ దేశాలదే అధికం. ప్రపంచ బ్యాంకుకు ప్రత్యా మ్నాయంగా పేద దేశాలకు తోడ్పడే సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళిక, మౌలిక సదుపాయా లపై సూచనలివ్వటం, వాటి వ్యయానికి నిధులు సమకూర్చటం తదితరాలను చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) చూస్తోంది. సభ్యదేశాల జాతీయ కరెన్సీల్లో వాణిజ్యం నెరపుతూ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, చెల్లింపులకోసం స్విఫ్ట్‌ వంటి పేమెంట్‌ విధానంలోకాక ‘బ్రిక్స్‌ పే’ ద్వారా లావాదేవీలు జరపటం ఇప్పటికే మొదలయ్యాయి. 

ఇన్నివిధాల సహాయ సహకారాలు కొనసాగే బ్రిక్స్‌ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా అనే సంశయం చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈ కూటమిలోని దేశాలే వేరే కూటముల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ అమెరికా కనుసన్నల్లో నడుస్తాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు సహకరిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు సరేసరి. అయితే ఆగిపోవటం కన్నా అడుగు ముందుకేయటమే అందరికీ ప్రయోజనకరం. కలిసి పనిచేసే సంస్కృతి పెంపొందటంవల్ల అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. దగ్గరయ్యేందుకు వీలుంటుంది. 

సమష్టి కార్యా చరణ అవసరమైన రంగాలు చాలానే ఉన్నాయి. ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీ, ఐక్యరాజ్యసమితిని బహుళ ప్రాతినిధ్య సంస్థగా చేయాలన్న డిమాండ్‌ వగైరాల్లో ఈ దేశాలు సమష్టిగా పనిచేయొచ్చు. వాతావరణం, విద్య, ఇంధనం, డిజిటల్‌ పేమెంట్‌ వేదికలు వగైరాల్లో సహకరించుకోవచ్చు. అలాగని కల్లోల కాలంలో కూటములు మనుగడ అంత సులభమేమీ కాదు. తమపై అమెరికా ప్రకటించిన దురాక్రమణ యుద్ధాన్ని బ్రిక్స్‌ ఖండించాలని ఇరాన్‌ బలంగా కోరుకుంటోంది. 

అదే సమయంలో తమపై ఇరాన్‌ సాగిస్తున్న దాడుల్ని కూడా వ్యతిరేకించాలని సౌదీ, యూఏఈ ఆశిస్తాయి. అందుకే బ్రిక్స్‌ ఉమ్మడి ప్రకటన అంత సులభమేమీ కాదు. ఇటీవల బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు నేరుగా అమెరికానూ, ఇజ్రాయెల్‌నూ ప్రస్తావించకుండా ఇరాన్‌పై దాడిని ఖండించింది. అక్కడైతే సౌదీ, యూఏఈ సభ్యదేశాలు కాదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఈ సమస్యను బ్రిక్స్‌ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాల్సివుంది. ఆ దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య ఏదోమేర సామరస్యం సాధించగలిగితే, సమష్టి స్వరం వినిపించగలిగితే బ్రిక్స్‌ బలం మరింత పెరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement