breaking news
Masoud Pezeshkian
-
అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు!
ఐక్యరాజ్యసమితి: అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగిపోదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. సంఘర్షణను ముగించడానికి దౌత్యమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. దాడులకు ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు. శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు అని ఉద్ఘాటించారు. పౌర వినియోగ అణు కార్యకలాపాలకు, అణ్వాయుధాల తయారీకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. శాంతియుత అణు సాంకేతికతపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇతర దేశాల అనుమతితో సంబంధం లేకుండా తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఇరాన్ ఎవరి అనుమతీ కోరబోదని పేర్కొన్నారు. అణు తనిఖీల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పెజెష్కియన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు, ఇతర ఆయుధ సామర్థ్యాలు ఉండగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ తనిఖీల కోసం ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆక్షేపించారు. అణ్వాయుధాలు ఇజ్రాయెల్ చేతిలో ఉండగా, తనిఖీలు చేస్తామంటూ ఇరాన్‌ను వేధిస్తున్నారని విమర్శించారు. హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ నౌకల రాకపోకలకు ఇతర దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరో పించారు. హార్మూజ్ వల్ల తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతర దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు. ఈ జలసంధిలో శత్రుదేశాల నౌకాదళాలను శాశ్వతంగా మోహరించడం, యుద్ధాన్ని విస్తరించడం వల్ల మనం ఆశించిన శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం పెజెస్కియాన్ ప్రసంగించారు. ఇరాన్ తన పొరుగు దేశాలను ప్రత్యర్థులుగా పరిగణించదని, బలమైన పొరుగు దేశాలు ఉండాలని కోరుకుంటోందని తెలిపారు. టెహ్రాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇస్తున్న ఇతర దేశాలు ఈ జలమార్గాన్ని ఉపయోగించుకోవడాన్ని తాము అంగీకరించబోమని వెల్లడించారు. అమాయక విద్యార్థులను చంపడం ఏమిటి? ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం అంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. తాము ఉగ్రవాదులం కాదని.. ముమ్మాటికీ ఉగ్రవాద బాధితులమని తేల్చిచెప్పారు. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి లక్ష్యంగా మారిందని అన్నారు. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మినాబ్ పాఠశాలపై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఈ రాక్షసకాండలో అమాయక చిన్నారులు బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ ఇరాన్ పౌరులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, జనరల్ అసెంబ్లీలో పెజెష్కియాన్ మాట్లాడుతుండగా అమెరికా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అస్థిరతకు మేము కారణం కాదు ప్రత్యర్థి దేశాలు తమ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంపై జరుగుతున్న పిరికిపంద దాడులకు సాధారణ ప్రజలే లక్ష్యమయ్యారని ఆక్షేపించారు. ప్రత్యర్థులపై ఇరాన్ సైన్యం చేస్తున్న ప్రతిదాడులను సమర్థించుకున్నారు. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని చెప్పారు. తమ పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని తమ దళాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. తాము ప్రతిస్పందిస్తున్నాం తప్ప ఇతర దేశాల్లోని సాధారణ పౌరులను ఏనాడూ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. గాజాలోని పరిస్థితిని సైతం ప్రస్తావించారు. అస్థిరతకు తాము కారణం కాదన్నారు. స్వతంత్రంగా జీవించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం ‘చాలా ఫలవంతమైనది’గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివరి్ణంచారు. అయితే, ఈ చర్చల ఫలితంగా అమెరికా, ఇరాన్ మధ్య తక్షణ ఒప్పందం గానీ, శాంతి సాధనలో పురోగతి గానీ కనిపించలేదు. -
ఏకపక్ష ఆంక్షలతో ప్రజలపై తీవ్ర ప్రభావం: పెజెష్కియాన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై అధికంగా ఆధారపడితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు రాజకీయ ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. అందుకే బ్రిక్స్ కూటమి దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక చట్రం దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాలపై విమర్శలు గుప్పించారు. కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రత, ప్రజల సంక్షేమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి సంబంధించిన ఒక వేదిక స్థాయిని దాటేసి, నేడు మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచం కోసం పెరుగుతున్న ఆకాంక్షకు ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. అటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరికీ ఇతరుల భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. -
లొంగేది లేదు.. సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: ఇరాన్ అధ్యక్షుడి వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయన తన విధులను కొనసాగిస్తున్నారని సంచలన ప్రకటన చేశారు. ఖమేనీ ఆచూకీపై వస్తున్న ఊహాగానాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తున్న సమాచార యుద్ధంలో భాగమేనని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన పెజెష్కియాన్.. ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.‘దేవుడి దయవల్ల మా సుప్రీం లీడర్ బతికే ఉన్నారు. ఆయన తన విధులను కొనసాగిస్తున్నారు’ అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడినప్పటి నుంచి ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై తీవ్ర ఊహాగానాలు మొదలయ్యాయి. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దాడుల్లో మరణించిన తర్వాత కూడా మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత కారణమైంది.సుప్రీం లీడర్‌దే నిర్ణయం..అయితే, ఖమేనీ ఎక్కడున్నారో గుర్తించలేకపోవడంతోనే అమెరికా, ఇజ్రాయెల్ ఆయనపై ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నాయని పెజెష్కియాన్ ఆరోపించారు. ఇరాన్ నాయకులు, సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని.. అందుకే సుప్రీం లీడర్ ఆచూకీని భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. ఇరాన్లో తుది నిర్ణయాధికారం మాత్రం సుప్రీం లీడర్దేనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక బలగాలను ఎదుర్కొనే బదులు పౌర మౌలిక వసతులు, ఆహార సరఫరాలు, ప్రజల జీవనోపాధులపై దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఇరాన్‌ను లొంగదీసుకోలేరని, తమ దేశం ఎప్పటికీ లొంగబోదని ఎక్స్ వేదికగా తేల్చిచెప్పారు.అణు కార్యక్రమంపై..ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను కూడా పెజెష్కియాన్ కొట్టిపారేశారు. తమ అణు కార్యక్రమం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే సాగిందని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అంతర్జాతీయ సంస్థలు నిరంతరం పర్యవేక్షించాయని పేర్కొన్నారు. అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామన్న ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. అణు అంశంపై చర్చలకు ఇరాన్ సిద్ధంగానే ఉందని తెలిపారు. అయితే అమెరికాతో తక్షణమే ప్రత్యక్ష చర్చలకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి అలీ ఖమేనీ హత్య తర్వాత అమెరికాపై ఇరాన్లో నమ్మకం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఇరాన్‌పై దాడులు నిలిపివేయడంతో పాటు ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు తగినంత పరిశీలన జరగడం లేదని ప్రశ్నించారు.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కోసం ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ సహా ప్రాంతీయ దేశాలు కలిసి ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పెజెష్కియాన్ ప్రతిపాదించారు. యుద్ధాల కంటే పరస్పర సహకారం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలే ప్రాంతానికి మేలు చేస్తాయని అన్నారు. యూఏఈతో తమకు ఎలాంటి సమస్య లేదని, పొరుగు దేశాలను సోదర దేశాలుగానే చూస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఒకవైపు తమ సుప్రీం లీడర్ బతికే ఉన్నారని స్పష్టం చేస్తూనే.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగేది లేదంటూ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. ఖమేనీ ఆచూకీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉండటం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
పీఎం మ్యూజియం, బ్రిక్స్ బజార్‌ను సందర్శించిన పెజెష్కియాన్ కుమార్తె
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోపాటు భారత్ మండపానికి విచ్చేసిన ఆయన కుమార్తె జహ్రా శనివారం ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి మ్యూజియం’, బ్రిక్స్ బజార్లను సందర్శించారు. ప్రధానిమ్యూజియంలో ప్రజాస్వామ్య ఘనచరితను, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తాలూకు విశేషాలను ఆమె తెల్సుకున్నారు. శిఖరాగ్ర సదస్సు జరిగే మండపానికి సమీపంలోని నేషనల్ క్రాఫ్స్ మ్యూజియంను సైతం ఆమె సందర్శించారు. అక్కడి బ్రిక్స్ బజార్లో ఆమె కలియతిరిగారు. చేతి వృత్తి కళాకారులు, సంప్రదాయక వస్తువుల విశేషాలను అడిగి తెల్సుకున్నారు. జహ్రా పెజెష్కియాన్ బ్రిక్స్ బజార్‌ను ఎంతో ఆసక్తిగా చూశారని ఆమెకు అక్కడ స్వాగతం పలికిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. బ్రిక్స్ బజార్లో బ్రెజిల్ మృణ్మయ పాత్రలు మొదలు బెలారస్లో విల్లో చెట్ల కొమ్మలతో అల్లిన కళాకృతులదాకా బ్రిక్స్ దేశాలకు చెందిన సంపద్రాయక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లోని మ్యూజియంను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ సతీమణి లీజా అరానేటా కూడా సందర్శించారు. -
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. -
సమష్టి స్వరం సాధ్యమేనా!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా లడాయి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు వగైరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఊపిరాడకుండా చేస్తున్న తరుణంలో న్యూఢిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాగా... చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్ శనివారం చేరుకుంటారు. ఆయన ఏడేళ్ల తర్వాత మన దేశం వస్తున్నారు. ఇక ఇరాన్ అధ్యక్షుడొకరు భారత్‌కొచ్చి ఎనిమిదేళ్లవుతుండగా, పెజెష్కియాన్ అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక సమావేశం జరగటం,ఆ వెంటనే పెజెష్కియాన్ కూడా ఆయనతో ద్వైపాక్షిక భేటీ కావటంతో పాటు, తదనంతరం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో కూడా పాలుపంచుకోవటంతో దౌత్య సందడి ముందే మొదలైనట్టయింది. ఆవిర్భవించిననాడు బ్రిక్స్వి బుడి బుడి అడుగులే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాల విదేశాంగమంత్రులు 2006లో తొలిసారి సమావేశమై కూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. 2009లో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. దక్షిణాఫ్రికా 2011లో చేరాక చివరిలో ‘ఎస్’ చేరి బ్రిక్స్ అయింది. అటుపై వరసగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండొనేసియాలు వేర్వేరు సంవత్సరాల్లో చేతులు కలిపాయి. మొత్తంగా ఇది 20 దేశాల కూటమిగా రూపొందింది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాల వాటా 49.5 శాతం. ప్రపంచంలోని నాలుగోవంతు భూభాగం దీని సొంతం. ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం వాటా. వాణిజ్య ఎగుమతుల్లో 21.6 శాతం, దిగుమతుల్లో 17.3 శాతం వాటా ఈ దేశాలదే. ప్రపంచ ఇంధన ఉత్పత్తిలో బ్రిక్స్ వాటా 40 శాతం. కొనుగోలు శక్తిలో జీ7 దేశాలకన్నా బ్రిక్స్ దేశాలదే అధికం. ప్రపంచ బ్యాంకుకు ప్రత్యా మ్నాయంగా పేద దేశాలకు తోడ్పడే సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళిక, మౌలిక సదుపాయా లపై సూచనలివ్వటం, వాటి వ్యయానికి నిధులు సమకూర్చటం తదితరాలను చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) చూస్తోంది. సభ్యదేశాల జాతీయ కరెన్సీల్లో వాణిజ్యం నెరపుతూ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, చెల్లింపులకోసం స్విఫ్ట్ వంటి పేమెంట్ విధానంలోకాక ‘బ్రిక్స్ పే’ ద్వారా లావాదేవీలు జరపటం ఇప్పటికే మొదలయ్యాయి. ఇన్నివిధాల సహాయ సహకారాలు కొనసాగే బ్రిక్స్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా అనే సంశయం చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈ కూటమిలోని దేశాలే వేరే కూటముల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ అమెరికా కనుసన్నల్లో నడుస్తాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు సహకరిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు సరేసరి. అయితే ఆగిపోవటం కన్నా అడుగు ముందుకేయటమే అందరికీ ప్రయోజనకరం. కలిసి పనిచేసే సంస్కృతి పెంపొందటంవల్ల అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. దగ్గరయ్యేందుకు వీలుంటుంది. సమష్టి కార్యా చరణ అవసరమైన రంగాలు చాలానే ఉన్నాయి. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఐక్యరాజ్యసమితిని బహుళ ప్రాతినిధ్య సంస్థగా చేయాలన్న డిమాండ్ వగైరాల్లో ఈ దేశాలు సమష్టిగా పనిచేయొచ్చు. వాతావరణం, విద్య, ఇంధనం, డిజిటల్ పేమెంట్ వేదికలు వగైరాల్లో సహకరించుకోవచ్చు. అలాగని కల్లోల కాలంలో కూటములు మనుగడ అంత సులభమేమీ కాదు. తమపై అమెరికా ప్రకటించిన దురాక్రమణ యుద్ధాన్ని బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో తమపై ఇరాన్ సాగిస్తున్న దాడుల్ని కూడా వ్యతిరేకించాలని సౌదీ, యూఏఈ ఆశిస్తాయి. అందుకే బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన అంత సులభమేమీ కాదు. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేరుగా అమెరికానూ, ఇజ్రాయెల్‌నూ ప్రస్తావించకుండా ఇరాన్‌పై దాడిని ఖండించింది. అక్కడైతే సౌదీ, యూఏఈ సభ్యదేశాలు కాదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఈ సమస్యను బ్రిక్స్ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాల్సివుంది. ఆ దేశాలకూ, ఇరాన్‌కూ మధ్య ఏదోమేర సామరస్యం సాధించగలిగితే, సమష్టి స్వరం వినిపించగలిగితే బ్రిక్స్ బలం మరింత పెరుగుతుంది. -
ఇరాన్ నాయకత్వంలో చీలిక?.. అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
ఇరాన్ అగ్ర నాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాల మధ్య అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం “చాలా కష్టంగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. యుద్ధ పరిస్థితుల వేళ దేశ అత్యున్నత నాయకత్వం మధ్య సమన్వయం ఎలా ఉందన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే పదవి చేపట్టిన తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చకు కారణమైంది. ఇప్పటివరకు ఎక్కువగా రాతపూర్వక ప్రకటనల ద్వారానే ఆయన స్పందిస్తున్నారు. ఇరాన్ కీలక సమయంలో ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ ప్రజల ముందుకు రాకపోవడం(ఆఖరికి తండ్రి అంత్యక్రియలకు కూడా..), నిర్ణయ ప్రక్రియ ఎలా సాగుతోందన్న అంశాలపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యుద్ధ సమయంలో నాయకత్వం నుంచి వచ్చే ప్రతి సంకేతాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ‘డబుల్ వాయిస్’ వినిపించారు. ఓవైపు కాస్త ప్రతికూల కామెంట్లు చేస్తూనే.. మరోవైపు మొజ్తబా ఖమేనీపై కొందరు కావాలనే ప్రతికూల ప్రచారం చేస్తున్నారని మద్దతుగా మాట్లాడారు. ఆయనతో తనకు సమావేశాలు జరిగాయని, ఎంతో ప్రశాంతంగా, తార్కికంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. “ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని కొందరు ఆయనపై వేరే విధమైన అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు” అని పెజెష్కియాన్ అన్నారు.ఆయనతో మాట్లాడటం కష్టం..మొజ్తబా ఖమేనీతో నేరుగా సంప్రదింపులు కొనసాగించడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. దీనివల్ల కీలక నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతుందనే విమర్శలను ఆయన అంగీకరించారు. అదే సమయంలో.. ఆయన ఉనికి ఇరాన్‌కు గొప్ప బలమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సుప్రీం లీడర్ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం కష్టంగా ఉన్నా.. ఆయన ఉనికి మనకు గొప్ప బలం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన నాయకత్వం అవసరం” అని పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఇరాన్ అగ్ర నాయకత్వంలో అధికార సమతుల్యతపై పలు అంతర్జాతీయ నివేదికలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కీలక భద్రతా, విదేశాంగ నిర్ణయాల్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ పాత్ర పరిమితమవుతోందని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరుగుతోందని కథనాలు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం.. విధానపరమైన విభేదాల నేపథ్యంలో పెజెష్కియాన్ రాజీనామా ఆలోచన కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.యుద్ధ వేళ పెరిగిన ఉత్కంఠఇరాన్ ప్రస్తుతం ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు సైనిక ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశ రాజకీయ, సైనిక వ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. సుప్రీం లీడర్ చుట్టూ నెలకొన్న అనిశ్చితి, అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు తెరతీశాయి.అయితే పెజెష్కియాన్ వ్యాఖ్యల్లో విభేదాల కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వాన్ని కాపాడే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన నిర్ణయాలపై వస్తున్న ఊహాగానాలు ఇరాన్ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తిని కొనసాగిస్తున్నాయి.


