ఇరాన్‌ నాయకత్వంలో చీలిక?.. అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు | Iran Leadership Rift, Prez Remarks On Khamenei Spark Fresh Debate Over Communication And Decision Making | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నాయకత్వంలో చీలిక?.. అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

Aug 6 2026 8:15 AM | Updated on Aug 6 2026 10:15 AM

Iran Leadership Rift Prez Remarks on Khamenei Spark Fresh Debate

ఇరాన్‌ అగ్ర నాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాల మధ్య అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం “చాలా కష్టంగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. యుద్ధ పరిస్థితుల వేళ దేశ అత్యున్నత నాయకత్వం మధ్య సమన్వయం ఎలా ఉందన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే పదవి చేపట్టిన తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చకు కారణమైంది. ఇప్పటివరకు ఎక్కువగా రాతపూర్వక ప్రకటనల ద్వారానే ఆయన స్పందిస్తున్నారు. ఇరాన్‌ కీలక సమయంలో ఉన్నప్పటికీ సుప్రీం లీడర్‌ ప్రజల ముందుకు రాకపోవడం(ఆఖరికి తండ్రి అంత్యక్రియలకు కూడా..), నిర్ణయ ప్రక్రియ ఎలా సాగుతోందన్న అంశాలపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యుద్ధ సమయంలో నాయకత్వం నుంచి వచ్చే ప్రతి సంకేతాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ‘డబుల్‌​ వాయిస్‌’ వినిపించారు. ఓవైపు కాస్త ప్రతికూల కామెంట్లు చేస్తూనే.. మరోవైపు మొజ్తబా ఖమేనీపై కొందరు కావాలనే ప్రతికూల ప్రచారం చేస్తున్నారని మద్దతుగా మాట్లాడారు. ఆయనతో తనకు సమావేశాలు జరిగాయని, ఎంతో ప్రశాంతంగా, తార్కికంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. “ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని కొందరు ఆయనపై వేరే విధమైన అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు” అని పెజెష్కియాన్‌ అన్నారు.

ఆయనతో మాట్లాడటం కష్టం..
మొజ్తబా ఖమేనీతో నేరుగా సంప్రదింపులు కొనసాగించడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. దీనివల్ల కీలక నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతుందనే విమర్శలను ఆయన అంగీకరించారు. అదే సమయంలో.. ఆయన ఉనికి ఇరాన్‌కు గొప్ప బలమని పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సుప్రీం లీడర్‌ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం కష్టంగా ఉన్నా.. ఆయన ఉనికి మనకు గొప్ప బలం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన నాయకత్వం అవసరం” అని పెజెష్కియాన్‌ వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ అగ్ర నాయకత్వంలో అధికార సమతుల్యతపై పలు అంతర్జాతీయ నివేదికలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కీలక భద్రతా, విదేశాంగ నిర్ణయాల్లో అధ్యక్షుడు పెజెష్కియాన్‌ పాత్ర పరిమితమవుతోందని, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) ప్రభావం పెరుగుతోందని కథనాలు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం.. విధానపరమైన విభేదాల నేపథ్యంలో పెజెష్కియాన్‌ రాజీనామా ఆలోచన కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాలపై ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

యుద్ధ వేళ పెరిగిన ఉత్కంఠ
ఇరాన్‌ ప్రస్తుతం ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు సైనిక ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశ రాజకీయ, సైనిక వ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. సుప్రీం లీడర్‌ చుట్టూ నెలకొన్న అనిశ్చితి, అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు ఇరాన్‌ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు తెరతీశాయి.

అయితే పెజెష్కియాన్‌ వ్యాఖ్యల్లో విభేదాల కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వాన్ని కాపాడే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన నిర్ణయాలపై వస్తున్న ఊహాగానాలు ఇరాన్‌ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తిని కొనసాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement