ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక (Strategic) అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పెంటగాన్ విధానాల విభాగం అధిపతి ఎల్బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మరిన్ని సైనిక ఎంపికలే లక్ష్యమా?
ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు చెబుతున్నారు. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేసిన సందర్భంలో, భారీ స్థాయి అణు దాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. ఒక సీనియర్ రక్షణ శాఖ అధికారి ప్రకారం..‘అమెరికాకు విశ్వసనీయమైన అణు ప్రతిస్పందన ఎంపికలు అవసరం. అధ్యక్షుడికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటేనే శత్రుదేశాలను సమర్థంగా నిరోధించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.
టాక్టికల్ అణు ఆయుధాలు అంటే?
టాక్టికల్ అణు ఆయుధాలు వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇవి యుద్ధభూమిలోని సైనిక స్థావరాలు, దళాలు లేదా ఇతర సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించేందుకు రూపొందించబడతాయి. అయినప్పటికీ, ఇవి కూడా భారీ ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. అనుకూల వర్గాలు ఇది అమెరికా అణు నిరోధక శక్తిని (Deterrence) మరింత బలపరుస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాటి వినియోగానికి ఉన్న మానసిక అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
కాగా, ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష (Policy Review) దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా మాత్రమే పరిగణించాలి. అయితే, 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచంలో యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించబడలేదు. అందుకే అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా, అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది.


