హసీనా ప్రెస్‌మీట్‌ తర్వాత బంగ్లాదేశ్‌లో కలకలం | Bangladesh Political Turmoil Deepens as Shakibs Residence Faces Attack | Sakshi
Sakshi News home page

హసీనా ప్రెస్‌మీట్‌ తర్వాత బంగ్లాదేశ్‌లో కలకలం

Aug 6 2026 6:38 AM | Updated on Aug 6 2026 6:44 AM

Bangladesh Political Turmoil Deepens as Shakibs Residence Faces Attack

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కొద్ది గంటల్లోనే ప్రముఖ క్రికెటర్‌, మాజీ ఎంపీ షకీబ్‌ అల్‌ హసన్‌ కుటుంబ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది. మగురా పట్టణంలోని కేశబ్‌మోర్‌ ప్రాంతంలో ఉన్న షకీబ్‌ పూర్వీకుల ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పాటు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఇంటి కిటికీలను ధ్వంసం చేశారని, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని మగురా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి అబ్దుల్లా అల్‌ మమూన్‌ వెల్లడించారు. కొందరు స్థానికులు పెట్రోల్‌ బాంబులు విసిరినట్లు చెబుతున్నప్పటికీ.. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు.

ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న గంటల్లోనే..
ఈ దాడి వెనుక షకీబ్‌ రాజకీయ అనుబంధమే కారణమని మాజీ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్‌ ఆరోపించింది. ఢిల్లీలోని ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ వేదికగా నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో షేక్‌ హసీనా మాట్లాడగా.. షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా అందులో పాల్గొన్నారు. ఈ పరిణామాల తర్వాతే తన ఇంటిపై దాడి జరిగిందని ఆవామీ లీగ్‌ పేర్కొంది. “ఆవామీ లీగ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైనందుకు ఇళ్లను తగలబెడుతున్నారు. బంగ్లాదేశ్‌ను నయా ఫాసిజం చుట్టుముడుతోంది” అంటూ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

అయితే దాడికి, హసీనా ప్రెస్‌మీట్‌కు మధ్య సంబంధం ఉందనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దాడికి పాల్పడిన వారి వివరాలు, ఉద్దేశం తెలియాల్సి ఉంది.

షకీబ్‌ అలా..
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన షకీబ్‌ అల్‌ హసన్‌ రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఆవామీ లీగ్‌ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక హత్య కేసులో కూడా ఆయన పేరు నిందితుల జాబితాలో చేరింది. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ భద్రత కల్పించాలని షకీబ్‌ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం షకీబ్‌ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లకుండా కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. వివిధ ఫ్రాంచైజీ క్రికెట్‌ టోర్నీల్లో మాత్రం కొనసాగుతున్నారు.

హసీనా సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. “నా తిరుగు ప్రయాణం అధికారం కోసం కాదు.. బంగ్లాదేశ్‌ను తిరిగి అభివృద్ధి, లౌకికవాదం, అభివృద్ధి మార్గంలోకి తీసుకురావడానికే” అని ఆమె అన్నారు. తిరిగి వెళ్తే అరెస్టు చేయవచ్చని, ప్రాణహాని కూడా ఉండొచ్చని తెలిసినా స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

2024 ఆగస్టు 5న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పదవి కోల్పోయిన తర్వాత షేక్‌ హసీనా భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఆమెకు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల ఆరోపణలపై గైర్హాజరులో మరణశిక్ష విధించింది.

..కొనసాగుతున్న రాజకీయ అశాంతి
హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలను ప్రచారం చేయొద్దంటూ కొన్ని మీడియా సంస్థలను హెచ్చరించినట్లు సమాచారం. హసీనా అనుచరులు మాత్రం దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. షకీబ్‌ ఇంటిపై దాడి ఘటన కూడా అదే రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకోవడం బంగ్లాదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం షకీబ్‌ ఇంటి వద్ద భద్రతను పెంచిన పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement