తిరువనంతపురం: కేరళ ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేయూహెచ్‌ఎస్) నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గైనకాలజీ ప్రశ్నపత్రం లీకయ్యిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. జూలై 31న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 15 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలు, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ముందుగానే అందుబాటులో ఉన్న మోడల్ ప్రశ్నాపత్రం నుంచి యథాతథంగా వచ్చినట్లు తేలింది. దీనివల్ల 24 మార్కులు (24 శాతం) మోడల్ పేపర్ నుంచే రావడంతో పరీక్ష విశ్వసనీయతపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరు నాలుగు మార్కుల ప్రశ్నలు మోడల్ పేపర్‌లోని క్రమ సంఖ్యతో పాటు అచ్చం అలాగే పునరావృతం కావడం విశేషం. ప్రశ్నపత్రం రూపొందించిన అధ్యాపకుడికి, దానిని పరిశీలించిన పరిశీలకుడికి (స్క్రూటినీ) మోడల్ పేపర్ ముందే ఇచ్చినప్పటికీ ఈ పొరపాటును గుర్తించడంలో విఫలమయ్యారని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మరోవైపు ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ నిర్వహణ విధానంపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల అనుసారమే పలు మార్పులు చేశామని విశ్వవిద్యాలయం సమర్థించుకుంది.
ఇది కూడా చదవండి: అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి


