ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల | MBBS Counseling Schedule Released | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Aug 2 2026 5:29 AM | Updated on Aug 2 2026 5:56 AM

MBBS Counseling Schedule Released

నాలుగో తేదీ నుంచి ఆలిండియా స్థాయిలో ప్రారంభం 

రాష్ట్ర స్థాయిలో 13 నుంచి తొలి దశ 

సెప్టెంబర్‌ ఎనిమిది నుంచి తరగతులు

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా 2026–27 ఎంబీబీఎస్‌ ఆలిండియా కోటా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల నాలుగవ తేదీన ప్రారంభం కానుంది. అదే విధంగా రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌  13వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో మొదలు కానుంది. ఈ మేరకు నీట్‌ యూజీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను శనివారం మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. కేంద్ర, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల పరిధిలోని వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను ఆలిండియా కౌన్సెలింగ్‌లో ఎంసీసీ భర్తీ చేస్తుంది. 

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను కూడా ఆలిండియా కోటా కింద పూర్తి చేయనుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటాకు పోను మిగిలిన 85 శాతం సీట్లను, ప్రైవేట్‌లో వంద శాతం (50 శాతం కన్వీనర్‌+50 శాతం మేనేజ్‌మెంట్‌) ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్ర స్థాయిలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. 

సెప్టెంబర్‌ 8 నుంచి తరగతులు
ఆలిండియా, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎంసీసీ నిర్ణయించుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మూడు సాధారణ రౌండ్‌ల కౌన్సెలింగ్‌ల అనంతరం మిగిలిపోయిన సీట్లన్నీ భర్తీ అయ్యే వరకు స్ట్రే వెకెన్సీ రౌండ్‌ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. రెండు రౌండ్‌ల సాధారణ కౌన్సెలింగ్‌ ముగిశాక సెప్టెంబర్‌ ఎనిమిదవ తేదీ నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. 

 దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఇతర యూజీ వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ–2026లో 11.21 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి 33,220 మంది నీట్‌లో రాణించారు. ఎంసీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర స్థాయి కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ను వచ్చేవారంలో విడుదల చేసే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement