సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని డివిజన్లకు ఆదేశాలు
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే వందేభారత్ ఏసీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను వైజాగ్ నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అధునాతన వందేభారత్ స్లీపర్‌ను నడపాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు సాధ్యాసాధ్యాలు, మార్గమధ్యంలో ఇతర రైళ్ల క్రాసింగ్స్, ప్రతిపాదిత టైమింగ్స్, తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డీఆర్‌ఎంలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ సీపీటీఎం షిఫాలీ కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ఆయా డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ రిపోర్టు వచ్చిన అనంతరం రైల్వే బోర్డుకు తుది ప్రతిపాదనలు పంపుతారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన వెంటనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ వందేభారత్ స్లీపర్ రైలు విశాఖ నుంచి పట్టాలెక్కనుంది. ప్రతిపాదనల ప్రకారం వారంలో ఆరు రోజుల పాటు రాత్రిళ్లు ఈ సర్వీస్ నడుస్తుంది. రైలు విశాఖలో బయలుదేరిన తర్వాత దువ్వాడ, విజయవాడ, కృష్ణా కెనాల్ జంక్షన్, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం మీదుగా బెంగళూరు చేరుకుంటుంది.


