సాగరగర్భంలో బాహుబలి | Nuclear submarine taking shape in Visakhapatnam | Sakshi
Sakshi News home page

సాగరగర్భంలో బాహుబలి

Aug 2 2026 5:49 AM | Updated on Aug 2 2026 5:49 AM

Nuclear submarine taking shape in Visakhapatnam

విశాఖలో రూపుదిద్దుకుంటున్న అణు జలాంతర్గామి

హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు..

రూ.10వేల కోట్లతో 13,500 టన్నుల భారీ అణు జలాంతర్గామి ఎస్‌–5 

ఐఎన్‌ఎస్‌ వర్ష రహస్య నేవల్‌ బేస్, షిప్‌ బిల్డింగ్‌ సెంటర్లలో నిర్మాణపనులు 

భారత సైనికశక్తిని మార్చనున్న నెక్స్ట్ జెన్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ 

సాక్షి, విశాఖపట్నం: దేశరక్షణకు మరో బాహుబలి సిద్ధమవుతోంది.  హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చలాయించేలా, చొరబాట్లను అరికట్టేలా, చైనాకు చెక్‌పెట్టేలా అణు జలాంతర్గామి రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలతో సత్తా చాటుతున్న ఇండియన్‌ నేవీ.. శత్రుదేశాల గుండెల్లో గుబులు రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో  నెక్స్ట్ జెన్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ను నిర్మిస్తోంది. 

13,500 టన్నుల బరువైన ఈ బాహుబలి అణు జలాంతర్గామిలో 190 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కాంపాక్ట్‌ లైట్‌ వాటర్‌ అణు రియాక్టర్, 8 వేల కిలోమీటర్లకు పైగా పరిధి ఉన్న కే–6 ఖండాంతర క్షిపణులు ఉంటాయి. విశాఖలోని రాంబిల్లి సమీపంలో ఉన్న రహస్య నేవల్‌ బేస్‌ ఐఎన్‌ఎస్‌ వర్ష, విశాఖపట్నంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లోను ఎస్‌–5 ప్రాజెక్టుగా దీని నిర్మాణపనులు మొదలయ్యాయి. డిజైనింగ్‌ నుంచి నిర్మాణం వరకు దీనికోసం రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 

డీఆర్‌డీవో, బార్క్, ఏటీవీ సంయుక్త డిజైన్‌ 
అరిహంత్, అరిఘాత్, ఎస్‌–4, ఎస్‌–4 స్టార్‌ వంటి సబ్‌మెరైన్లను విజయవంతంగా నిర్మించిన భారత్‌.. ఇప్పుడు అంతకంటే రెట్టింపు సామర్థ్యం గల భారీ సబ్‌మెరైన్లు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. 2006 నాటి ఉన్నతస్థాయి శాస్త్రవేత్తల కమిటీ సిఫారసుల ఆధారంగా డీఆర్‌డీవో, బార్క్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెసల్‌ (ఏటీవీ) కలిసి.. ఈ ఎస్‌–5 డిజైన్‌ని రూపొందించాయి. 

విశాఖలోనే ఎందుకంటే?
ఎస్‌–5 సబ్‌మెరైన్‌ నిర్మాణపనులు విశాఖలో చురుగ్గా సాగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన 190 మెగావాట్ల లైట్‌ వాటర్‌ రియాక్టర్‌ తయారీ చివరి దశకు చేరుకుంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న రాంబిల్లి వద్ద సముద్రపు లోతు ఎక్కువగా ఉండటం వల్ల జలాంతర్గాములు ఉపగ్రహాలు లేదా శత్రు రాడార్లకు చిక్కకుండా నీటి అడుగున ప్రయాణించి సముద్రంలోకి ప్రవేశించవచ్చు. అదేవిధంగా విశాఖలోని షిప్‌బిల్డింగ్‌ సెంటర్‌ దశాబ్దాలుగా అణు జలాంతర్గాముల నిర్మాణంలో అనుభవం సాధించింది. అణు జలాంతర్గాముల నిర్మాణానికి అవసరమైన పరికరాల్ని అందించే బార్క్, ఎల్‌ అండ్‌ టీ, బీహెచ్‌ఈఎల్‌ దీనికి సమీపంలో ఉన్నాయి. ఈ కారణాలతో ఈ భారీ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణానికి విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు. 

సైనిక శక్తిని మార్చేసే సత్తా 
ఎస్‌–5 అణు జలాంతర్గామి భారత రక్షణదళ అమ్ములపొదిలో చేరితే.. దేశ సైనికశక్తి దశ దిశ మారిపోతాయి. ఇందులో ఒకేసారి అనేక లక్ష్యాల్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న కే–6 బాలిస్టిక్‌ క్షిపణులుంటాయి. వీటిద్వారా శత్రుదేశాల్లోని ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతం(ఐవోఆర్‌)లో చైనా నౌకాదళ చొరబాట్లను గట్టిగా తిప్పికొట్టవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement