గతేడాది జూలైలో రూ.3,532 కోట్ల జీఎస్టీ రూ.3,366 కోట్లకి పతనం
ఈ ఆర్థిక ఏడాది నాలుగు నెలల జీఎస్టీలో కనిపించని వృద్ధి
ఏప్రిల్–జూలై కాలానికి రూ.14,954 కోట్లతో స్థిరంగా జీఎస్టీ ఆదాయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో మరోసారి రాష్ట్ర జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఆదాయం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించింది. గతేడాది జూలైలో రూ.3,532 కోట్లుగా (సెస్ మినహాయించి) ఉన్న ఆదాయం ఈ ఏడాది 5 శాతం క్షీణించి రూ.3,366 కోట్లకు పరిమితమయ్యింది. రూ.1,993.83 కోట్లు కేంద్ర ఐజీఎస్టీ కింద సెటిల్‌మెంట్ చేయడంతో మొత్తంమీద నికర జీఎస్టీ ఆదాయంలో వృద్ధి నమోదయ్యిందని రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
గతేడాదితో పోల్చితే ఐజీఎస్టీ కింద రూ.290.8 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని దీంతో నికర జీఎస్టీ విలువ రూ.2,930 కోట్ల నుంచి రూ.3,268 కోట్లకు చేరిందన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల కాలంలో ఆదాయం ఎటువంటి వృద్ధి లేకుండా రూ.14,954 కోట్లుగా నమోదయ్యింది. వ్యాట్, వృత్తిపన్ను వంటి అన్ని రకాల పన్నుల ఆదాయం కలుపుకుంటే ఈ ఏడాది ఏప్రిల్–జూన్ నెల కాలానికి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.20,466 కోట్లకు చేరుకుంది.


