కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. సీఎంకు షాకిచ్చిన మండలి చైర్మన్‌ | Karnataka Politics: Legislative Council Chairman Basavaraj Horatti Counter To CM DK Shivakumar Over Resignation Demand | Sakshi
Sakshi News home page

కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. సీఎంకు షాకిచ్చిన మండలి చైర్మన్‌

Aug 5 2026 8:06 AM | Updated on Aug 5 2026 10:01 AM

Karnataka Council Basavaraj Horatti Counter To CM Over resign

కర్ణాటక రాజకీయాల్లో ‘రాజీనామా’ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సీఎం డీకేకు ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం కొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం చేయాలన్న చర్చలు రాజకీయ దుమారం రేపగా, ఇప్పుడు అదే చర్చ శాసన మండలికి చేరింది. మండలి ఛైర్మన్ బసవరాజ్ హొరట్టికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరినట్లు హొరట్టి స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హొరట్టి వెంటనే స్పందిస్తూ..‘ఛైర్మన్‌ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించదు.. సభే ఎన్నుకుంటుంది. తొలగించాలంటే సభా నిబంధనల ప్రకారమే జరగాలి’ అని కౌంటర్‌ ఇచ్చారు. తన పదవీకాలం 2028 వరకు ఉందని, తనను తొలగించాలంటే సభలో అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిందేనని హొరట్టి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

తనను తొలగించాలంటే కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత సభలో జరిగే ఓటింగ్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 1956 నుంచి ఏ చైర్మన్‌ కూడా ప్రభుత్వం మధ్యలో రాజీనామా చేయించలేదని, తనను తొలగించడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 75 సభ్యుల కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్‌కు 38 మంది సభ్యులతో మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో హొరట్టి కొనసాగింపుపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. దీంతో, ముఖ్యమంత్రి, మండలి చైర్మన్‌ మధ్య పొలిటికల్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది.

అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం శాసన మండలి చైర్మన్ పదవికి సలీం అహ్మద్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్ పొన్నన్న, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉమాశ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. కాగా, పార్టీ ముందుగానే చైర్మన్ పేరును ప్రకటించడంపై హొరట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement