ట్రంప్‌నకు భారీ షాకిచ్చిన నెతన్యాహు | Israel Netanyahu rejects Trump Gaza draft Over Hamas disarms | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు భారీ షాకిచ్చిన నెతన్యాహు

Aug 5 2026 7:13 AM | Updated on Aug 5 2026 7:16 AM

Israel Netanyahu rejects Trump Gaza draft Over Hamas disarms

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షాకిచ్చారు. ట్రంప్‌ ప్రతిపాదించిన గాజా కాల్పుల విరమణ ముసాయిదాకు నెతన్యాహు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చేయకముందు గాజాలో ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. దీంతో, గాజా విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.

కాగా, ట్రంప్ ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం, హమాస్ నిరాయుధీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసి గాజాలో ఆక్రమించిన సుమారు 60 శాతం ప్రాంతాల నుంచి దశలవారీగా ఉపసంహరణ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ అంగీకరించలేదని నెతన్యాహు వెల్లడించారు.

ఈ సందర్భంగా నెతన్యాహు..‘ట్రంప్ ప్రభుత్వం ఒక ముసాయిదా పంపింది. అది మా ముసాయిదా కాదు. మేము దానికి అంగీకరించలేదు. మా అభిప్రాయాలను వారికి పంపించాం. హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి’ అని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ వైఖరి మరింత కఠినంగా మారినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్-అమెరికా మధ్య గాజా అంశంపై బహిరంగ విభేదాలు బయటపడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, గాజా నగరంలోని సబ్రా ప్రాంతంలో 2023 నవంబర్‌లో జరిగిన భారీ వైమానిక దాడి శిథిలాల నుంచి ఇటీవల వెలికితీసిన 112 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఆ దాడిలో 300 మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో అనేక మంది మృతదేహాలు ఇప్పటివరకు శిథిలాల కిందే ఉండిపోయాయని తెలిపారు. స్థానిక పౌర రక్షణ సంస్థ ప్రకారం, ఇంకా 157 మంది మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని అంచనా.

73వేల మరణాలు.. 
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 73 వేల మందికిపైగా పాలస్తీనీయులు మరణించారు. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ గణాంకాలపై ఇజ్రాయెల్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ, తమ దాడులు ఉగ్రవాద లక్ష్యాలపైనే జరుగుతున్నాయని చెబుతోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, గాజాలో హింస పూర్తిగా ఆగలేదు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement