ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది!. యెమెన్ తీరంలో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మందిని యెమెన్ కోస్ట్‌గార్డ్ సురక్షితంగా రక్షించింది. ఈ దాడి ఎవరి పని? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఎంఎస్‌వీ ఫైజ్ నూర్ ఒలియా (MSV Faize Noore Oliya) అనే నౌకపై గుర్తుతెలియని వస్తువు(క్షిపణి/పేలుడు పదార్థం) వచ్చి తగలడంతో అది బోల్తా పడి మునిగిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని యెమెన్ కోస్ట్‌గార్డ్ సహాయక చర్యలు చేపట్టి రక్షించి మొఖా పోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. వాళ్లలో 13 మంది భారతీయులు, ఓ విదేశీయుడు ఉన్నాడు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
పౌర నౌకపై జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకర పరిణామమని పేర్కొంది. భారతీయ నావికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సోనోవాల్ తెలిపారు. రక్షించబడిన సిబ్బందికి అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఘటనపై స్పందించింది. భారత జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండిస్తూ.. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. సిబ్బంది రక్షణలో సహకరించిన యెమెన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది.
అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఆందోళనకు దారితీసింది.
ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఎర్ర సముద్రం ఒకటి. సుయాజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియాలను కలిపే ఈ మార్గంలో ఇటీవలి కాలంలో భద్రతా సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా యెమెన్ సమీపంలోని బాబ్ అల్ మండెబ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో పలు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.


