మెటా గ్లోబల్‌ టీమ్‌కు ప్రభుత్వం సమన్లు | Indian govt summons Meta global team on August 5-6 over content moderation | Sakshi
Sakshi News home page

మెటా గ్లోబల్‌ టీమ్‌కు ప్రభుత్వం సమన్లు

Aug 5 2026 2:24 AM | Updated on Aug 5 2026 2:24 AM

Indian govt summons Meta global team on August 5-6 over content moderation

ఫేస్‌బుక్‌లో ప్రధాని రీల్‌ను అడ్డుకోవడంపై గుర్రు 

సాంకేతిక లోపమని మెటా వివరణ 

అంగీకరించని మంత్రిత్వ శాఖ 

వివరణ కోసం మెటా ఉన్నతాధికారులతో సమావేశం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా సంస్థల మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. చైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేటివ్‌ అండ్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ నిర్వహణలో లోపాలు ఒకానొక ప్రముఖ ఖాతాపై తప్పుడు చర్య వంటి అంశాలపై వివరణ ఇచ్చేందుకు మెటా గ్లోబల్‌ టీమ్‌తో నేడు, రేపు సమావేశం కానున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్‌. కృష్ణన్‌ మంగళవారం తెలిపారు. ఏఐ4భారత్‌ సిద్ధం చేసిన స్వతంత్ర ఏఐ మోడళ్ల పరీక్ష ప్లాట్‌ఫామ్‌ ఆవిష్కరణ సందర్భంగా ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కృష్ణన్‌ విలేకరులతో మాట్లాడారు.

సాంకేతికత విషయంలో అగ్రగామిగా ఉన్న మెటా ఇలాంటి తప్పులు జరక్కుండా చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ చట్టాల గురించి మెటా లాంటి ప్లాట్‌ఫామ్స్‌కు సరైన అవగాహన ఉండాలని, వాటి అమలు తీరు ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు ఐదు, ఆరు తేదీల్లో మెటా గ్లోబల్‌ టీమ్, ఉన్నతాధికారి జోయెల్‌ కప్లాన్‌ భారత్‌లోనే ఉంటారని అంచనా.  మెటా గ్లోబల్‌ టీమ్‌తో సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌–జీని ఉద్దేశిస్తూ చేసిన ఒక రీల్‌ ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు బ్లాక్‌ అయ్యింది. 

కొంత సమయం తరువాత రీల్‌ పోస్ట్‌ అయినప్పటికీ కేంద్రం మెటా సంస్థ ఉన్నతాధికారులను ప్రధాని కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. సాంకేతిక పరమైన సమస్యతోనే ఈ పొరబాటు దొర్లినట్టు వివరణ ఇచ్చిన మెటా అందుకు క్షమాపణలు  కోరింది. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. ఇన్‌స్టా గ్రామ్‌ ప్రకటనల్లో కొన్నింటిలో పిల్లల లైంగిక శోషణ, పోర్నోగ్రఫీ కనిపిస్తోందన్న ఆరోపణలు  మెటాపై ఉన్నాయి. ఈ అంశంపై మెటా ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం మెటాకు ఇప్పటికే నోటీసు జారీ చేసిందని, ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆగస్టు ఐదునాటి సమావేశం ఉపయోగపడుతుందని కృష్ణన్‌ చెబుతున్నారు.

దీంతోపాటు ఇతర అంశాలు చర్చకు వస్తాయని చెప్పారు. కృత్రిమంగా తయారైన సమాచారం విషయంపైనా చర్చ జరుగుతుందన్నారు. వీటితోపాటే ధ్రువీకరించిన ఖాతాల నుంచి కంటెంట్‌ను ఏకపక్షంగా తొలగించడం వంటి అంశాలపై కూడా మెటా అధికారులతో మాట్లాడతామని కృష్ణన్‌ మీడియాతో చెప్పారు. మెటాలో కొన్ని అంశాలు అవి పనిచేయాల్సిన విధంగా ఎందుకు చేయడం లేదో వారితోనే మాట్లాడి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలని తాము భావిస్తున్నట్లు కృష్ణన్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement