కేజ్రీవాల్‌ ఈ–20 మార్చ్‌ అడ్డగింత | Arvind Kejriwal E20 Protest March To PM House | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ ఈ–20 మార్చ్‌ అడ్డగింత

Aug 5 2026 2:16 AM | Updated on Aug 5 2026 2:16 AM

Arvind Kejriwal E20 Protest March To PM House

ఈ20 విధానానికి వ్యతిరేకంగా సంతకాలతో కూడిన పత్రాలతో నిరసన తెలుపుతున్న కేజ్రీవాల్‌

లక్షలాది వినతుల సంతకాలతో ప్రధాని నివాసం వైపు వెళ్తున్న

ఆప్‌ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

భారీ స్థాయిలో ఉద్యమిద్దామని పిలుపునిచ్చిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: వాహనాల జీవితకాలాన్ని క్షీణింపజేస్తున్న, మైలేజీని తగ్గిస్తున్న 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ విక్రయాలను తక్షణం నిలిపేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలో ప్రధాని అధికార నివాసం దిశగా మంగళవారం మొదలెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇథనాల్‌ కలిపిన ఇంధన విధానాన్ని తప్పుబడుతూ వంద మందికిపైగా నిరసనకారులు 2.3 లక్షల పిటిషనర్ల సంతకాలున్న పత్రాలను తలపై మోస్తూ ర్యాలీగా బయల్దేరారు.

‘ట్రంప్‌కు సాగిలపడే సంస్కృతికి చరమగీతం పాడండి’,‘ఇథనాల్‌ కొనుగోళ్లను ఆపండి’, ‘పెట్రోల్‌ దొంగలు ఎక్కడ దొరుకుతారు? బీజేపీ ఆఫీస్‌లో’అని నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చారు. వీళ్లను ఢిల్లీ పోలీసులు మధ్యలోనే నిలువరించారు. దీంతో నిరసనగా కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్, ఆప్‌ నేతలు జాస్మిన్‌ షా తదితరులు 5, ఫిరోజ్‌ షా రోడ్డులో బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా వాహన యజమానులు సహా 2.3 లక్షల మంది పిటిషనర్ల సంతకాలు చేసిన ఫిర్యాదుల పత్రాలు ప్రధాని మోదీకి చేరాల్సిందే.

ఇథనాల్‌ కలిపిన ఈ20 బ్లెండెడ్‌ ఇంధనంతో వాహనదారులు పడుతున్న కష్టాలను మోదీ వినాల్సిందే. ఈ పిటిషన్లను ప్రధాని కార్యాలయానికి చేర్చాలి. ఈ20 పెట్రోల్‌ కష్టాలను విడమర్చేందుకు నెల క్రితమే మోదీతో అపాయింట్‌మెంట్‌ కోరితే ఇవ్వలేదు. ఇప్పుడు వందమందికిపైగా వెళ్లి కలుద్దామంటే అడ్డుకుంటున్నారు. ఇథనాల్‌ కలపని ఫ్యూర్‌ పెట్రోల్‌ను కొనే అవకాశమూ వాహనదారులకు ఉండాల్సిందే. ఈ20 పెట్రోల్‌నే బలవంతంగా ఎలా కొనిపిస్తారు?. ఈ20 పెట్రోల్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతంచేద్దాం’’అని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement