సంక్షోభ సమయంలో లీటర్‌కు రూ.30 వరకు ఆదా
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. అమెరికా–ఇరాన్ యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు భారతీయ వినియోగదారులను ధరల భారం నుంచి రక్షించడంలో ఈ20 పెట్రోల్ విధానం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమాసియాలో సంక్షోభం త్రీవస్థాయిలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు(సుమారు రూ.13,000) పెరిగాయని గుర్తుచేసింది. ఆ సమయంలో భారత్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.125కు చేరి ఉండేదని వెల్లడించింది. కానీ, మన ప్రభుత్వం భారీగా ధర పెంచలేదని తెలియజేసింది. సంక్షోభ సమయంలో వినియోగదారులకు లీటర్‌కు రూ.30 వరకు ఆదా ఆయినట్లు పేర్కొంది. 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఢిల్లీలోని వినియోగదారులు లీటర్‌కు రూ.94.77 చొప్పున చెల్లిస్తున్నారని వివరించింది. దీనివల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం మన వినియోగదారులపై పడడం లేదని తేల్చిచెప్పింది.
80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించడమే ఈ20 విధానం. దీన్ని ప్రతిపక్షాలు, వినియోగదారుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని కొందరు వాహనాల యజమానులు చెబుతున్నారు. అయితే, అందులో నిజం లేదని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఈ20 వల్ల మైలేజీ కొంత తగ్గినప్పటికీ, దానివల్ల కలిగే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని వాదిస్తోంది.


