కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే? | What is Xtreme Weather Grade Diesel and Why the Army Calls it a Game Changer | Sakshi
Sakshi News home page

కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే?

Aug 1 2026 6:13 PM | Updated on Aug 1 2026 6:25 PM

What is Xtreme Weather Grade Diesel and Why the Army Calls it a Game Changer

భారత సైన్యం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే.. దేశంలో అభివృద్ధి చేసిన ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (XWG) డీజిల్‌ను సైన్యం వినియోగంలోకి తీసుకురావడం మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ సరికొత్త డీజిల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నిజానికి.. సాధారణ డీజిల్ తీవ్ర చలిలో గడ్డకట్టే అవకాశం ఉంది. ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ మాత్రం మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అందుకే భారత సైన్యాధిపతి దీనిని సైన్యానికి గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు.

XWG డీజిల్ గురించి..
XWG అంటే ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్. పేరుకు తగ్గట్టుగా.. ఇది అత్యంత చల్లని వాతావరణ పరిస్థితులను తగ్గుకుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ XWGను ప్రత్యేకంగా తయారు చేశారు. సాధారణ డీజిల్ తీవ్రమైన చలిలో చిక్కబడి ఫ్యూయల్ లైన్లను, ఫిల్టర్లను మూసివేసే అవకాశం ఉంటుంది. దీంతో వాహనాలను స్టార్ట్ చేయడం కష్టమవుతుంది. కానీ XWG డీజిల్ అలాంటి సమస్యలను అధిగమించేలా రూపొందించారు. మైనస్ 42 డిగ్రీల వరకు కూడా ఇది గడ్డకట్టకుండా పనిచేస్తుంది.

ఈ డీజిల్ అవసరం ఏమిటి?
భారత సైన్యం లడఖ్, సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన మంచు ప్రాంతాల్లో నిరంతరం విధులు నిర్వహిస్తుంటుంది. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల కంటే తక్కువకు చేరిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో సాధారణ డీజిల్ గడ్డకట్టడంతో ట్యాంకులు, ట్రక్కులు, ఇతర సైనిక వాహనాలు పనిచేయడం కష్టమయ్యేది. దీని వల్ల సైనికులు రాత్రంతా వాహనాలను తరచూ స్టార్ట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డీజిల్ గడ్డకట్టకుండా ఉండేందుకు ఇంధన ట్యాంకుల కింద 'బుఖారీ' అనే సంప్రదాయ హీటర్‌ను కూడా ఉపయోగించేవారు. ఇది అదనపు శ్రమతో పాటు భద్రతాపరమైన ప్రమాదాలకు కూడా దారితీసేది.

XWG డీజిల్ ఉపయోగాలు
ఈ కొత్త డీజిల్‌ ద్వారా తీవ్రమైన చలిలో కూడా వాహనాలు సులభంగా స్టార్ట్ అవుతాయి. దీంతో సైనిక వాహనాలు ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుంది. సైనికులపై అదనపు ఒత్తిడి తగ్గుతుంది. అలాగే డీజిల్ గడ్డకట్టకుండా ఉండేందుకు ప్రమాదకరమైన పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ డీజిల్‌ ఉపయోగించడానికి ప్రత్యేకంగా కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత సైన్యం వినియోగిస్తున్న వాహనాల్లోనే ఎలాంటి ఇంజిన్ మార్పులు చేయకుండా దీనిని ఉపయోగించవచ్చు. ఇది BS-VI ఉద్గార ప్రమాణాలు మరియు IS 1460:2025 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారైంది.

సాధారణ ప్రజలు ఉపయోగించవచ్చ?
ప్రస్తుతం ఈ డీజిల్‌ను ప్రధానంగా సైన్యం కోసం రూపొందించినప్పటికీ, భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి తీవ్ర చలిగాలులు వీచే ప్రాంతాల్లో వాహనాలు ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు.

ఈ ప్రత్యేక డీజిల్‌ను భారత సైన్యం, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు కలిసి కేవలం ఏడాది వ్యవధిలో అభివృద్ధి చేశాయి. ఇది 'మేక్ ఇన్ ఇండియా' దిశగా మరో విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో కూడా సైన్యం అవసరాలకు అనుగుణంగా ఇలాంటి మరిన్ని ప్రత్యేక ఇంధనాలు, సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement