ఈ ఏడాదే డీజిల్‌లో ఐసోబ్యుటనాల్‌ | Isobutanol in diesel this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే డీజిల్‌లో ఐసోబ్యుటనాల్‌

Jul 5 2026 5:53 AM | Updated on Jul 5 2026 5:53 AM

Isobutanol in diesel this year

15 శాతం మిశ్రమం కలిపే దిశగా కేంద్రం అడుగులు 

ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం అమలు.. దిగుమతుల భారం 

తగ్గించేందుకే బయో ఫ్యూయల్‌ మిశ్రమం

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ (ఈ–20) కలిపి విక్రయించేందుకు ఇటీవల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాదిలోనే డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్‌ కలిపి విక్రయించే విధానానికి శ్రీకారం చుట్టనుంది. దీనివల్ల ముడి చమురు దిగుమతుల భారం తగ్గుతుందని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రూ.10,88,904 కోట్ల విలువైన ముడి చమురు దిగుమతి చేసుకుంది. అయితే పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపి విక్రయించడం వల్ల రూ.1.9 లక్షల కోట్లకుపైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్లు కేంద్రం పేర్కొంది.   

ఇథనాల్‌ కంటే భిన్నమైనది.. 
ఇథనాల్, ఐసోబ్యుటనాల్‌ రెండూ ఆల్కహాల్‌ ఆధారిత జీవ ఇంధనాలే అయినప్పటికీ వాటి భౌతిక, రసాయన ధర్మాలలో చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌లో కలుపుతున్న ఇథనాల్‌.. పెట్రోల్‌ కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఐసోబ్యుటనాల్‌ నాలుగు కార్బన్ల పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉండి ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇది తేమను అస్సలు పీల్చుకోదు. అందుకే ఇది ఇథనాల్‌ కంటే చాలా భిన్నమైనది, మెరుగైనది. దీనివల్ల శక్తి సాంద్రత పరంగా ఇది సాధారణ డీజిల్‌కు మరింత దగ్గరగా ఉంటుంది. ఇంధన వ్యవస్థ భాగాలు, పైప్‌లైన్లు, నిల్వ మౌలిక సదుపాయాలను ఇది త్వరగా తుప్పు పట్టనీయదు. ఎక్కువ మోతాదులో ఇథనాల్‌ను కలపాలంటే ఇంధన వ్యవస్థలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కానీ ఐసోబ్యుటనాల్‌ను ప్రస్తుతం ఉన్న ఇంజన్లు, పంపిణీ నెట్‌వర్క్‌లలో పెద్దగా మార్పులు చేయకుండానే తక్కువ సాంద్రతలలో డీజిల్‌లో సులభంగా కలపవచ్చు. 

అయితే 15 శాతం ఐసోబ్యుటనాల్‌ కలిపినప్పుడు మైలేజీ తగ్గుదలలో వచ్చే మార్పు చాలా స్వల్పంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జీవ ఇంధనాలు కలిపిన ఇంధనాలు వాడటం వల్ల వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలు తగ్గి కాలుష్యం అదుపులోకి వస్తుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. జీవ ఇంధనాల తయారీకి వ్యవసాయ ఉత్పత్తులు అవసరం కాబట్టి దేశంలోని రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు.  

త్వరలో ట్రయల్స్‌.. 
2 శాతం ఐసోబ్యుటనాల్‌ కలిపిన డీజిల్‌తో పైలట్‌ ట్రయల్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చర­ర్స్, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, టెస్టింగ్‌ ఏజెన్సీలతో కూడిన ప్రభుత్వ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది.  

ఐసోబ్యుటనాల్‌ అంటే.. 
ఇది ఒక రకమైన బయో–ఆల్కహాల్‌. దీన్ని వ్యవసా­య వ్యర్థాలు, చెరకు పిప్పి, ఇతర సేంద్రియ పదార్థాల నుంచి తయారు చేస్తారు. సాధారణ డీజిల్‌తో పోలిస్తే ఇది పర్యావరణానికి తక్కువ హాని చేస్తుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement