సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల క్రమబద్ధీకరణపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాన్ ఏసీ, ఏసీ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీఫ్లెక్స్‌లలో వసూలు చేయాల్సిన కనిష్ఠ (మినీమం), గరిష్ఠ (మాగ్జిమం) ధరలను ఈ కొత్త మార్గదర్శకాల్లో అధికారికంగా ఖరారు చేశారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం సవరించిన టికెట్ ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
1.నాన్ ఏసీ థియేటర్లు కనిష్ఠ టికెట్ ధర: రూ. 50గరిష్ఠ టికెట్ ధర: రూ. 100
2.ఏసీ థియేటర్లు కనిష్ఠ టికెట్ ధర: రూ. 100 గరిష్ఠ టికెట్ ధర:రూ. 200
3.మల్టీఫ్లెక్స్‌లు కనిష్ఠ టికెట్ ధర:రూ. 200 గరిష్ఠ టికెట్ ధర: రూ. 300
సామాన్యులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద సాధారణ ధరలకే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు గరిష్టంగా ఐదు ప్రదర్శనలు ఇచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
చిన్న సినిమాల మనుగడను కాపాడటానికి ప్రతి థియేటర్‌లో రోజుకు ఒక షోను తప్పనిసరిగా చిన్న చిత్రాలకే కేటాయించాల్సి ఉంటుంది. భారీ బడ్జెట్ (రూ. 100 కోట్లకు పైగా) చిత్రాలకు మొదటి 10 రోజుల పాటు తాత్కాలికంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు 'సూపర్ హై బడ్జెట్' హోదా కల్పించింది.
ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఖాతాలో జమ చేయాలనే సరికొత్త నిబంధనను కూడా ప్రభుత్వం విధిగా అమలు చేయనుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరల పరిమితులను ఉల్లంఘించి అధిక రేట్లకు టికెట్లు విక్రయిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.


