ఉదయం లేవగానే ఓ కప్పు చాయ్ పడాల్సిందే.. ఆఫీస్ పనిలో అలసటైనా, స్నేహితులతో సరదా కబుర్లయినా, చలిగాలులైనా తేనీరుతోనే కిక్ వస్తుంది. ఒకప్పుడు సింగిల్ చాయ్, హాఫ్ చాయ్‌లకే పరిమితమైన టీ కొట్లు.. ఇప్పుడు సరికొత్త రుచులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. మారుతున్న టీ ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా రకరకాల ఫ్లేవర్లు అందుబాటులోకి తెచ్చారు.
రామగిరి(నల్లగొండ): చక్కెర వాడకం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని.. చాలామంది ఇప్పుడు బెల్లం టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా సాధారణ బెల్లం టీతో పాటు స్పెషల్ బెల్లం టీ, బెల్లం–అల్లం టీ, బెల్లం–లెమన్ టీ, బెల్లం–గ్రీన్ టీలను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా బెల్లంతో చేసే హాట్ కాఫీ, బ్లాక్ కాఫీలతో పాటు బూస్ట్, హార్లిక్స్, బాదం పాలు వంటి పానీయాలకు సైతం గిరాకీ పెరిగింది.
ఆరోగ్యదాయక ఫ్లేవర్లు..
మరోవైపు ప్రత్యేక టీ స్టాళ్లలో మూలికలు, సుగంధ ద్రవ్యాలతో కూడిన ఫ్లేవర్డ్ టీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రీత్యా లెమన్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ, జీరా టీ, బ్లాక్ టీ వంటి వాటిని బెస్ట్ ఆప్షన్లుగా ఎంచుకుంటున్నారు. ఏదేమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా టీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది.
పేరులో స్పెషల్
చౌటుప్పల్ : ప్రయాణికులను ఆకర్షించేలా హోటళ్లకు ఇంటి వంట, అమ్మచేతి వంట ఇలా వినూత్నమైన పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ టీ స్టాళ్లకు సైతం పాకింది. హైవేలపై ఆగే వాహనదారుల దృష్టిని ఆకర్షించేలా.. రకరకాల విలక్షణమైన పేర్లతో చాయ్ స్టాళ్లు వెలుస్తున్నాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామ శివారులో హైవే వెంట కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వర్కాల ప్రదీప్ ఫ్రాంచైజీ పద్ధతిలో ‘ఇంటి చాయ్’ పేరుతో ఓ టీస్టాల్ ఏర్పాటు చేసి అన్ని రకాల చాయ్‌లు అందిస్తున్నాడు.
రుచి మారకుండా ప్రత్యేక యంత్రం
ఫ్రాంచైజర్ సరఫరా చేసే టీ పౌడర్‌తో చాయ్ తయారు చేసుకుని ఇక్కడ ఓ ప్రత్యేకమైన బాక్స్‌లో నిల్వ చేస్తారు. ఆ విద్యుత్ బాక్స్‌లో కింది భాగంలో నీరు, పై భాగంలో పాలు నిల్వ చేసుకునే సదుపాయం ఉంటుంది. బాక్స్‌కు ఉన్న నియంత్రణ బటన్ ద్వారా చాయ్‌కి కింది బాక్సులో ఉన్న నీరు మనకు కావాలి్సన మోతాదులో వేడి అవుతుంది. వాతావరణం ఎలా ఉన్నా.. వేడి స్థిరంగా ఉండటంతో బాక్సులోని చాయ్ రుచిలో ఏమాత్రం తేడాలు లేకుండా కస్టమర్లకు అందుతోంది.
ఫిల్టర్ కాఫీకి ఫిదా
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. జనాల ఆలోచనకు తగ్గట్లు కొన్ని సంస్థలు దక్షిణ భారతీయ సంప్రదాయ రుచులకు ఆధునిక హంగులను మేళవించి సరికొత్త పానీయాలను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫిల్టర్ కాఫీ ఘుమఘుమల స్టాళ్లు ఇప్పుడు ఫ్రాంచైజీల సాయంతో ఏర్పాటు చేసి జనాలను ఆకర్షిస్తున్నారు.
– కోదాడ
కాఫీకి ఘనమైన చరిత్ర..
17వ శతాబ్దంలో బాబా బుడాన్ అనే సూఫీ ప్రవక్త ఝెమెన్ దేశం నుంచి కాఫీ గింజలను తీసుకొచ్చి కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు, చంద్రగిరి కొండల్లో నాటినట్లు తెలుస్తోంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారి రాకతో కాఫీ వినియోగం పెరిగింది. కర్ణాటకలో కాఫీ పంట పండుతున్నప్పటికీ బ్రిటిష్ వారు ఎక్కువగా మద్రాస్‌లో నివసించేవారు. ఈ ఫిల్టర్ కాఫీ తయారీ వారికి నచ్చడంతో విరివిగా హోటళ్లు పెరిగాయి. క్రమేణా ఈ కాఫీకి మద్రాస్ కాఫీ అని.. దీని తయారీలో రంధ్రాలు గల ఫిల్టర్‌ను వాడుతుండడంతో ‘మద్రాస్ ఫిల్టర్ కాఫీ’ అని పేరు వచ్చినట్లు తెలుస్తుంది.
తయారీలో గిన్నె, గ్లాస్‌దే ప్రత్యేకత..
ఫిల్టర్ కాఫీ తయారీలో నాణ్యమైన కాఫీ గింజలతో పాటు నురగలు తెప్పించడానికి వాడే గిన్నె, గ్లాస్ ముఖ్యమైనవి. కాఫియా అరబికా, రొబస్టా అనే కాఫీ మొక్కల నుంచి వచ్చే విత్తనాలను వేయించి పొడి చేస్తారు. దీనికి సువాసన రావడానికి చికోరి మొక్క నుంచి వచ్చే పొడి కలుపుతారు. ఫిల్టర్ గల పాత్ర ద్వారా డికాషన్ తయారుచేసి, దాన్ని వేడి పాలతో కలుపుతారు. అనంతరం గిన్నె, గ్లాస్ తీసుకుని ఒకదాని నుంచి మరొక దానిలోకి ఎత్తు నుంచి పోస్తూ నురగలు తెప్పిస్తారు. ఎంత ఎక్కువ నురగ వస్తే అది అంత మంచి ఫిల్టర్ కాఫీ అన్నమాట.
ఆకట్టుకుంటున్న ఫ్రాంచైజీలు
విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి వెంట పదుల సంఖ్యలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ, చెన్నపట్నం, అరకు ఫిల్టర్ కాఫీల ఇలా.. పలు రకాల పేర్లతో కాఫీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాఫీ తయారీకి కావాలి్సన సామగ్రిని ఫ్రాంచేజీకి అనుమతి ఇచ్చే సంస్థే సమకూరుస్తుంది. అదేవిధంగా కాఫీ తయారీ కోసం కొంత మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ప్రయాణికులు కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఈ సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు.


