తగ్గేదే లేదు.. బదిలీలు కొత్తకాదు | VC Sajjanar Transfer Fire Department Comments | Sakshi
Sakshi News home page

తగ్గేదే లేదు.. బదిలీలు కొత్తకాదు

Nov 20 2026 5:58 AM | Updated on Nov 20 2026 5:58 AM

VC Sajjanar Transfer Fire Department Comments

26 ఏళ్ల సర్వీసులో 20 సార్లు బదిలీ అయ్యా: వీసీ సజ్జనర్‌

నేనేంటో.. నేనేం చేశానో ప్రజలకు తెలుసు

కొందరు ఉనికి కోసమే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

అగ్నిమాపకశాఖ, ఎస్పీఎఫ్‌ డీజీగా బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘బదిలీలు నాకు కొత్తేమీ కాదు. ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చినా వెనుకాడేది లేదు.. తగ్గేదే లేదు. అదే స్పీడ్‌.. అంతే హార్డ్‌వర్క్, కమిట్మెంట్‌తో పనిచేస్తాను’అని అగ్నిమాపకశాఖ డీజీ వీసీ సజ్జనర్‌ అన్నారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ నుంచి అగ్నిమాపకశాఖ డీజీగా, ఎస్పీఎఫ్‌ డీజీగా బదిలీ అయిన çసజ్జనర్‌ గురువారం నానక్‌రాంగూడలోని అగ్నిమాపకశాఖ కేంద్ర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తన బదిలీ ప్రభుత్వ పరిపాలనలో భాగంగానే జరిగిందని.. ఇందుకు ప్రత్యేకమైన కారణాలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎస్‌ అధికారిగా 26 ఏళ్ల సర్వీసులో 20 సార్లు బదిలీ అయ్యానని.. 17 పోస్టింగ్‌లలో పనిచేశానని చెప్పారు. మరో మూడు బదిలీల్లో బాధ్యతలు తీసుకోకుండానే మరోచోటికి బదిలీ అయిన సందర్భాలు ఉన్నాయని సజ్జనార్‌ గుర్తుచేసుకున్నారు. 2000 సంవత్సరంలో జనగాం ఏఎస్పీగా అటు నుంచి పులివెందుల, ఆ తర్వాత కొత్తగూడేనికి బదిలీ చేశారన్నారు.

2003లోనూ నల్లగొండ ఎస్పీ నుంచి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా, కడప ఎస్పీగా కూడా బదిలీ అయినట్లు గుర్తుచేసుకున్నారు. బదిలీలు ఉద్యోగ జీవితంలో సహజమని, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఎక్కడ బాధ్యత అప్పగిస్తే అక్కడ తనదైన ముద్ర వేసేలా ఆ విధులపై దృష్టి సారించడం తన పద్ధతని సజ్జనర్‌ చెప్పారు. సీఐడీ, ఎస్‌ఐబీ, సీఐ సెల్, ఆర్టీసీ ఎండీగా ఇలా అనేక ఏళ్లపాటు తాను పోలీస్‌ యూనిఫాం లేకుండానే విధులు చేపట్టానన్నారు.

ప్రతి అంశానికీ కాలమే బదులిస్తుంది..
కొందరు కేవలం ఉనికి చాటుకోవడానికే తన పేరును, ఫొటోను వాడుకొని దుష్ప్రచారం చేస్తున్నారని.. వాళ్లు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని సజ్జనార్‌ కొట్టిపారేశారు. మాజీ ఐపీఎస్‌ అధికారి నాగేశ్వర్‌రావుతోపాటు మరికొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు, ప్రచారంపై మీడియా ప్రశ్నించగా సజ్జనార్‌ పైవిధంగా స్పందించారు.

తాను ఇప్పుడు వివాదాల జోలికి వెళ్లదల్చుకోలేదని.. ప్రతి అంశానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. మాజీ ఐపీఎస్‌ అధికారి నాగేశ్వర్‌రావు చేసిన ట్వీట్లపై న్యాయనిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తానని చెప్పారు. 26 ఏళ్లుగా ఐపీఎస్‌ అధికారి వివిధ హోదాల్లో పనిచేశానని, పోలీస్‌ అధికారిగా తాను ఏమిటో, ఏం చేశానో ప్రజలకు తెలుసన్నారు.

అగ్నిమాపకశాఖలో సంస్కరణలపై దృష్టి పెడతా 
తెలంగాణ అగ్నిమాపకశాఖ పనితీరు మెరుగుపర్చేలా సాంకేతికత వినియోగం పెచండంతోపాటు నూతన సంస్కరణలపై దృష్టి పెట్టనున్నట్టు సజ్జనార్‌ తెలిపారు. గతేడాదిగా తెలంగాణ అగ్నిమాపకశాఖ అధికారులు 214 మంది ప్రాణాలు కాపాడడంతోపాటు రూ. 700 కోట్ల విలువైన ఆస్తులను కాపాడారని తెలిపారు. తెలంగాణ అగ్నిమాపకశాఖ రెస్పాన్స్‌ టైం గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలుంటే పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాలు ఉందని తెలిపారు. అగ్నిప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచడంపైనా ఎక్కువ దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement