ఏఐనే సరైన మందు! | AI Drug Discovery Hyderabad Pharma Revolution | Sakshi
Sakshi News home page

ఏఐనే సరైన మందు!

Nov 20 2026 5:47 AM | Updated on Nov 20 2026 5:47 AM

AI Drug Discovery Hyderabad Pharma Revolution

ఏఐతో గణనీయంగా తగ్గనున్న మందుల తయారీ ఖర్చు, సమయం

ఏఐ కోసం ఫార్మా కంపెనీల భారీ ఖర్చు

ఏఐ ఆధారిత ఔషధ పరిశోధనల్లోనూ దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్‌

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఔషధ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రాణాంతక వ్యాధులకు తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా, సమర్థవంతమైన మందులను తయారు చేయడంలో ఏఐ సహకారాన్ని ఔషధ తయారీ సంస్థలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నాయి. అయితే, పూర్తి స్థాయిలో ఏఐ వినియోగం అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తాజా శాస్త్రీయ పరిశోధనలు, అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కృత్రిమ మేధ వల్ల ఔషధాల తయారీలో వేగం పెరిగినప్పటికీ.. తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌ (మూడో దశ) దాటి రోగుల చేతికి పూర్తిస్థాయి ఏఐ మందులు రావడానికి ఇంకా అడ్డంకులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేన్సర్, అరుదైన జన్యు వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలకు మెరుగైన చికిత్సలను అందించే దిశగా ఏఐ బలమైన పునాది వేసింది. రాబోయే 3 నుంచి∙5 ఏళ్లలో ఈ సాంకేతికత ఫలాలు సామాన్య రోగులకు నేరుగా, మరింత తక్కువ ధరకే అందే అవకాశం ఉంది.

గణాంకాల్లో ఏఐ విజయాలు
సాంప్రదాయ పద్ధతిలో ఒక కొత్త మందును కనిపెట్టి, మార్కెట్లోకి తీసుకురావడానికి 10 ఏళ్లకు పైగా సమయం, బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది.  వ్యాధికారక ప్రోటీన్‌ నిర్మాణాన్ని గుర్తించి, దానికి తగిన ఔషధ అణువును (మాలిక్యూల్‌) రూపొందించడానికి 4 నుంచి 6 ఏళ్లు పడుతుంది. ఏఐ అల్గారిథమ్‌లు ఈ ప్రక్రియను 12 నుంచి 18 నెలలకు తగ్గించాయి. ప్యాంక్రియాటిక్‌ కేన్సర్‌ కు ఔషధాన్ని రూపొందించే పరిశోధనలో శాస్త్రవేత్తలకు పదేళ్లు పట్టిన ఒక కీలక ఆవిష్కరణను ఏఐ కేవలం రెండు గంటల్లోనే ఛేదించిందని ప్రముఖ కేన్సర్‌ నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీ వెల్లడించారు.

ఫార్మా కంపెనీల భారీ పెట్టుబడులు...
మెన్లో వెంచర్స్, 2026 నివేదిక ప్రకారం ఔషధ ఆవిష్కరణల్లో ఏఐ పై ఫార్మా కంపెనీలు చేస్తున్న వ్యయం ఒక్క ఏడాదిలోనే 23 రెట్లు పెరిగి 700 మిలియన్‌ డాలర్లకు చేరింది. సాంప్రదాయ పద్ధతిలో రూపొందించిన మందుల తొలి దశ భద్రతా పరీక్షల్లో సగటు విజయం కేవలం 52 శాతం మాత్రమే కాగా, ఏఐ రూపొందించిన ఔషధాలకు అది 80 నుంచి 90 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 129 నుంచి 200కు పైగా ఏఐ ఆధారిత మందులు వివిధ దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఊపిరితిత్తుల వ్యాధి కోసం ఇన్సెలికో మెడిసిన్‌ సంస్థ ఏఐ సాయంతో పూర్తిస్థాయిలో రూపొందించిన మందు 2026 జూలైలో తుది దశ (మూడో దశ) ట్రయల్స్‌లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది.

అసలు సవాళ్లు ఏమిటీ ?
2026 పూర్తి కావస్తున్నా..నేటికి కూడా పూర్తిస్థాయిలో ఏఐ సృష్టించిన ఏ ఒక్క మందుకూ అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తుది ఆమోదం లభించలేదు. 2027 లో మొదటి ఆమోదం లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మందు సురక్షితమే అని తేలినా (ఫేస్‌  ఐ), అది మనిషి శరీరంలోని వ్యాధిని నిజంగా నయం చేస్తుందా లేదా అని తేల్చే రెండో దశ పరీక్షల్లో ఏఐ మందుల విజయ శాతం సాధారణ మందుల మాదిరిగానే (సుమారు 20–40%) ఉంటోంది. మానవ శరీర జీవక్రియల సంక్లిష్టతను ఏఐ ఇంకా పూర్తిగా అంచనా వేయలేకపోవడమే దీనికి కారణం.

టాప్‌లో హైదరాబాద్‌
ప్రపంచ వ్యాక్సిన్, ఫార్మా రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్, ఇప్పుడు కృత్రిమ మేధ ఆధారిత ఔషధ పరిశోధనల్లోనూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని బలమైన ఫార్మా మౌలిక సదుపాయాలకు ఏఐ సాంకేతికత తోడవడంతో, రాబోయే రోజుల్లో ప్రపంచానికి అవసరమైన ఉత్తమ కేన్సర్‌ మందులు, వ్యాక్సిన్లు మన నగరం నుంచే రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో ఏఐ ఆధారిత ఔషధ ఆవిష్కరణల కంపెనీలలో 26 సంస్థలతో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. (బెంగళూరు 21, పుణే 11 సంస్థలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి).

ప్రభుత్వ, దిగ్గజ సంస్థల భాగస్వామ్యం... 
తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌ , ఎంఈఐటీవై స్టార్టప్‌ హబ్‌తో కలిసి హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ’గ్రీన్‌ ఫార్మా ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా పర్యావరణ హితమైన మందుల తయారీ మరియు ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌ ’పాప్‌వాక్స్‌’ తన RNA ఫౌండ్రీ ద్వారా సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. రోగి కణితి లోని జన్యు మార్పులను విశ్లేషించి, ఏఐ సాయంతో కేవలం 8 నుంచి 10 వారాల్లోనే వ్యక్తిగతీకరించిన mRNA కేన్సర్‌ వ్యాక్సిన్‌ను డిజైన్‌ చేస్తోంది.

ఏఐ ఆంకాలజీ క్లినిక్‌
హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌ (హైటెక్‌ సిటీ) గ్రూప్‌ తల, మెడ కేన్సర్లను కచ్చితంగా గుర్తించేందుకు ప్రత్యేక ఏఐ ఆంకాలజీ క్లినిక్‌ను ప్రారంభించింది. అలాగే కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ (ఎంఐటీ, మేయో క్లినిక్‌ సహకారంతో) గ్రూప్, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఏఐ ఆధారిత స్కానింగ్‌ ద్వారా రొమ్ము, ఊపిరితిత్తుల కేన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తున్నాయి. హైదరాబాద్‌ పరిశోధకులు అభివృద్ధి చేసిన ‘Fuzzy RS& Net’ అనే ఏఐ మోడల్, మమోగ్రామ్‌ స్కాన్‌ల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను 94.9 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తూ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది.

ఇదీ చదవండి: డిజిటల్‌ ‘తెర’ దించి.. పుస్తకం తెరిచి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement