‘నోట్లు–ఓట్లు’ భ్రమలో సీఎం.. | KTR Sensational Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘నోట్లు–ఓట్లు’ భ్రమలో సీఎం..

Nov 20 2026 4:59 AM | Updated on Nov 20 2026 4:59 AM

KTR Sensational Comments On CM Revanth Reddy

20 శాతం కమీషన్లు ఇస్తేనే సర్కారులో పనులు: కేటీఆర్‌  

సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయం చెబుతున్నారు 

అధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మును కక్కిస్తాం 

ఇది ప్రజాపాలన కాదు.. అవినీతి పాలన

ఢిల్లీ నాయకులు వచ్చినప్పుడల్లా రేవంత్‌ వణికిపోతున్నారు 

ఢిల్లీ నేతలకు బాడీగార్డుల్లా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.15 వేలు ఇచ్చి ప్రజలను కొనుగోలు చేయొచ్చని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆరోపించారు. డబ్బులు పంచితే ప్రజలు తనకే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారని మండిపడ్డారు. ఏడాది తర్వాత బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్‌ నాయకుల అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ భవన్‌లో గురువారం భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన నేతలకు కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 20 శాతం కమీషన్‌ ఇవ్వనిదే పనులు కావడం లేదని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.

పర్సంటేజీ ఇవ్వనిదే పనులు జరగడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి చెప్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి, కుంభకోణాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. నిధులను సీఎం కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు అవినీతి పాలన అని కాంగ్రెస్‌ నాయకులే అంగీకరిస్తున్నారు.

ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకే అర్జీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌ నాయకులు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ కుంభకోణాలు బయట పెడతారు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు 
‘రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించకుండా ఢిల్లీ పార్టీలకు బాడీ గార్డుల్లా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా రేవంత్‌ రెడ్డి వణికిపోతున్నారు. ప్రియాంక గాం«దీకి బాడీగార్డుగా రేవంత్‌ వ్యవహరిస్తే హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ బైక్‌ ర్యాలీ వెనుక పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్, మంత్రి వివేక్‌ పరుగులు తీశారు.

కేంద్ర మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన సందర్భంలో బీజేపీ అధ్యక్షుడు రాంచంద్రరావు ఆయన కాళ్లు మొక్కుతున్నారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి గులాములుగా వ్యవహరించడం దురదృష్టకరం’అని కేటీఆర్‌ అన్నారు.

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని గుడిలో పూజలు చేసిన భట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా అమలు చేయడం లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement