నవంబర్ 19– 22 వరకు హైదరాబాద్‌లో ‘ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్’ (ఐఆర్‌సీ) 85వ వార్షిక సమావేశాలు
The 85th Annual Session of the Indian Roads Congress (IRC) మంచి రోడ్లు ప్రగతికి సూచికలు. ఒక ప్రాంతం లేదా దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే అక్కడి రహదారుల పరిస్థితిని చూస్తే చాలు. రోడ్లు బాగుంటే రైతు తన పంటను మార్కెట్‌కు త్వరగా తీసుకెళ్ల గలుగుతాడు, వ్యాపారాలు విస్తరిస్తాయి, పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే రహ దారులు కేవలం ప్రయాణానికి ఉపయోగ పడే మార్గాలు మాత్రమే కాదు.. ప్రజల జీవితాలను, భవిష్యత్తును మార్చే అభివృద్ధి బాటలు.
రహదారుల అభివృద్ధికి సంబంధించి, ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్’ (ఐఆర్‌సీ) 85వ వార్షిక సమావేశాలు నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్‌సెంట ర్‌లో జరగనుండడం మనందరికీ గర్వకారణం. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభం కానుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి 3,500 మందికి పైగా రహదారుల రంగ నిపుణులు, ఇంజినీర్లు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
రహదారులు, వంతెనల నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధికి అవసరమైన సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించే అత్యున్నత జాతీయ సంస్థ ‘ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్’. జయకర్ కమిటీ సిఫార్సుల మేరకు 1934 డిసెంబర్‌లో న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 84 వార్షిక సమావేశాలను నిర్వహించింది.
ఈ సమావేశాల్లో రహదారుల నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, పర్యా వరణహిత రహదారులు, వాతావరణ మార్పులను తట్టుకునే నిర్మాణ పద్ధతులు, సొరంగ మార్గాల నిర్మాణం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. సదస్సులో సుమారు 400 ప్రదర్శన స్టాళ్లు ఉంటాయి. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు రహదారుల నిర్మాణా నికి సంబంధించిన ఆధునిక యంత్రాలు, నూతన ఆవిష్కరణలు, నిర్మాణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నాయి. ఈ ప్రదర్శనలు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకే కాకుండా నిర్మాణ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల మధ్య కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలకు దోహదపడతాయి.
పాదచారుల భద్రతే...
ఈ సమావేశాల్లో ముఖ్యమైన అంశం ప్రతి ఒక్కరికీ ‘సురక్షితంగా నడిచే హక్కు’. వేల కోట్ల రూపాయలు వెచ్చించి రహ దారులు, ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తున్నప్పుడు పాదచారుల భద్రతను కూడా అంతే ముఖ్యంగా చూడాలి. చిన్నపిల్లలు,వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచేందుకు ఫుట్‌పాత్‌లు, రోడ్లు దాటేందుకు సురక్షితమైన ఏర్పాట్లు ఉండాలి. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద రహదారులు నిర్మించడం మాత్రమే కాదు... వాటిపై ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రతకు భరోసా కల్పించడం కూడా. ఈ సమావేశాల్లో మొత్తం 19 ప్రత్యేక సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండే రహదారులను ఎలా నిర్మించాలి? భారీ వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రోడ్లను ఎలా అభివృద్ధి చేయాలి? రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉప యోగించాలి? వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రతి గ్రామానికి మంచి రహదారి, ప్రతి ఒక్కరికీ సురక్షిత ప్రయాణం కల్పించడమే మన ప్రధాన లక్ష్యం కావాలి.
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి


