‘నీ పెళ్లాం అయితే..’ డ్రైవర్‌ దురుసు ప్రవర్తన! | MGBS Bus Station RTC Driver Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

‘నీ పెళ్లాం అయితే..’ డ్రైవర్‌ దురుసు ప్రవర్తన!

Nov 19 2026 9:48 AM | Updated on Nov 19 2026 9:56 AM

MGBS Bus Station RTC Driver Incident In Hyderabad

హైదరాబాద్‌: ప్రయాణికులు అడిగిన చిన్నపాటి విజ్ఞప్తులకు మర్యాదగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజా రవాణా సిబ్బందిపై ఉంటుంది. కానీ ఓ ఆర్టీసీ డ్రైవర్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన భార్య గర్భిణి అని, కొంచెం జాగ్రత్తగా బస్సు నడపాలని కోరిన ప్రయాణికుడిపై బూతులతో విరుచుకుపడ్డాడు. మహిళలు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా నోటికొచ్చినట్లు దూషించాడు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రయాణికుడు తన భార్య ప్రెగ్నెన్సీతో ఉందని, ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా కొంచెం నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లాలని డ్రైవర్‌ను కోరాడు. అయితే డ్రైవర్‌ మాత్రం ఆ అభ్యర్థనను సానుకూలంగా తీసుకోలేదు. పైగా ‘నీ పెళ్లాం అయితే సొంతంగా బస్సు కట్టించుకో’ అంటూ అభ్యంతరకర పదజాలంతో దూషించినట్లు వీడియోలో వినిపిస్తోంది. ‘ప్రతీవాడూ చెప్పేవాడే’ అంటూ మరింత దురుసుగా మాట్లాడాడు.

నిజానికి ప్రయాణికుడు కోరింది డ్రైవర్‌కు పెద్ద కష్టమైన పనేమీ కాదు. గర్భిణి మహిళ ప్రయాణిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్లాలని అడగడం తప్పా? ఆర్టీసీ డ్రైవర్‌ కాస్త సంయమనంతో ‘సరే తమ్ముడూ.. జాగ్రత్తగా వెళ్తాను’ అని చెప్పి ఉంటే అక్కడితో సమస్య ముగిసిపోయేది. కానీ, మహిళల ముందే ఇంత అసభ్యంగా మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డ్రైవర్‌ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆర్టీసీ సిబ్బందికి లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement