సాక్షి, హైదరాబాద్: వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ఏర్పాటు చేసుకోవటం కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. 0007, 9999, 5555, 0009... ఇలా నచ్చిన నెంబర్‌ను తన వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ మీద చూసుకోవాలని మురుస్తుంటారు. ఇందుకోసం, ఆ నెంబర్‌ను రవాణాశాఖ వేలంలో ఉంచేవరకు ఎదురుచూసి, దరఖాస్తు చేస్తారు. ఇక ఈ తీరు సాగదు. కోరిన నంబర్ సీరీస్ వచ్చేవరకు ఎదురు చూస్తానంటే కుదరదు.
సిస్టం ఆటోమేటిక్‌గా రెగ్యులర్ నెంబర్‌ను కేటాయిస్తుంది. దాన్ని కచ్చితంగా వాహనానికి అమర్చుకోవాల్సిందే. వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువుగా ఉన్న 30 రోజులను దీనికి కూడా అన్వయిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలనుకున్నవారు వాహనం కొన్న 30 రోజుల్లో దాన్ని పొందాల్సి ఉంటుంది. లేకుంటే రెగ్యులర్ సీరీస్‌లో వచ్చే నెంబర్‌ను రవాణా శాఖ కేటాయిస్తుంది. కాగా, మార్చి నుంచి వాహన్ పోర్టల్ ఆధారంగా కార్యక లాపాలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఇందులో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
దీంతో ఫ్యాన్సీ నెంబర్లను వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిన 60 రోజుల్లో పొందేవీలు కల్పించారు. గతంలో నిబంధనలను అనుసరించకపోయినా ఇబ్బందులు రాలేదు. కానీ, ఇప్పుడు వాహన్ పోర్టల్‌లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరుగుతున్నందున కచ్చితంగా నిబంధనలను అనసరించాల్సి వస్తోంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు 30 రోజులే అయినందున, ఆలోపే నంబర్ కేటాయింపు జరగాలి. దీంతో ఫ్యాన్సీ నెంబర్ అయినా అదే గడువులోపు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా 60 రోజుల గడువును రద్దు చేసి నిబంధనల ప్రకారం 30 రోజుల్లో ఫ్యాన్సీ నంబర్లు తీసుకునేలా మార్చింది.


