- అబివాదం చేస్తున్న విజూ కృష్ణన్, - మాట్లాడుతున్న అశోక్ దావలే
నల్లగొండ వేదికగా ముగిసిన 36వ జాతీయ మహాసభలు – అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్ దావలే, విజూ కృష్ణన్
రామగిరి(నల్లగొండ): దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) సమరశీల పోరాటాలకు సమాయత్తమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహించిన ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు మంగళవారం ముగిశాయి. మహాసభల ముగింపు సందర్భంగా ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, అధ్యక్షుడు అశోక్ ధావాలే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే కాలంలో చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.
దేశ నలుమూలల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు, పరిశీలకులు ఈ మహాసభకు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో రైతులు తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మహాసభ ఆవేదన వ్యక్తం చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మహాసభ ప్రతినిధులు మండిపడ్డారు.
భవిష్యత్ పోరాటాల కార్యాచరణ
దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏఐకేఎస్ పలు కీలకమైన దేశవ్యాప్త పోరాటాలకు పిలుపునిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నారు. బంగాళాదుంపలు సాగుచేస్తున్న రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన తప్పుడు కేసులను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతు నాయకులు ప్రకటించారు. భూమి హక్కులు, అడవి భూములు రక్షణ కోసం ప్రత్యేక జాతీయ కన్వెన్షన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
కీలక తీర్మానాలు ఆమోదం
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై అఖిల భారత కిసాన్ సభ సమరశంఖం పూరించింది. తీర్మానాలలో కొన్ని
రాష్ట్రాల పన్నుల అధికారాన్ని, ఆర్థిక స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాలి
దేశవ్యాప్తంగా చెరుకు రైతులను ఆదుకునేందుకు 9.5 శాతం రికవరీ ప్రాతిపదికన టన్నుకు రూ.6,000 కనీస మద్దతు ధర నిర్ణయించాలి.
వ్యవసాయ పరిశోధన, విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని వ్యవసాయ జీడీపీలో కనీసం 1 శాతానికి పెంచాలి.
భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా మహిళలను స్వతంత్ర రైతులుగా గుర్తించాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి. జనగణనతో ముడిపెట్టకుండా తక్షణమే 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి.
తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం
తెలంగాణ నుంచి ఏఐకేఎస్ జాతీయ కమిటీలోకి 8 మంది ఎన్నికయ్యారు. అందులో టి.సాగర్, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బి.రాంబాబు, పి.జంగారెడ్డి, కందాల ప్రమీల, శోభన్ ఉన్నారు. వీరిలో నుంచి సీకేసీలోకి టీ.సాగర్, పి.సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏఐకేఎస్ జాతీయ కమిటీలోకి ఐదుగురిని తీసుకున్నారు. అందులో ప్రభాకర్ రెడ్డి, వి.కృష్ణయ్య, సూర్యనారాయణ, ఎం.హరిబాబు, బి.బలరామ్ ఉన్నారు. వీరిలో నుంచి సీకేసీలోకి ప్రభాకర్ రెడ్డి, కష్ణయ్య, ఎం హరిబాబును తీసుకున్నారు.
కిసాన్ సభ నూతన కార్యవర్గం ఎన్నిక...
ఏఐకేఎస్ నూతన ఆఫీస్ బేరర్ల జాబితాను బుధవారం సాయంత్రం ప్రకటించారు. సంఘం జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ ధావాలే, ప్రధాన కార్యదర్శిగా విజూ కృష్ణన్, ఆర్థిక కార్యదర్శిగా పుష్పేంద్ర త్యాగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం కల్పిస్తూ 12 మంది ఉపాధ్యక్షులను, 12 మంది సంయుక్త కార్యదర్శులను ఎన్నుకున్నారు. 27 మందితో ఆఫీస్ బేరర్ల బృందంతో పాటు, విధాన నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ కిసాన్ కమిటీ (సీకేసీ) కోసం 86 మంది సభ్యులకు, అలాగే ఆల్ ఇండియా కిసాన్ కౌన్సిల్ కోసం 167 మంది సభ్యులకు చోటు కల్పించారు.
ఇదీ చదవండి: జల దోపిడీకి రేవంత్ సహకారం


