మధుమేహ చక్రబంధంలో బస్తీవాసులు.. అయినా చికిత్సలకు దూరం
మందులు, పరీక్షలకు డబ్బుల్లేక నిర్లక్ష్యం చేస్తున్న వైనం
అస్థిర ఉపాధి, ఇంటి ఖర్చులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపాలూ కారణమే..
ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలో కీలక అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: షుగర్ వ్యాధికి మెడిసిన్ లేదని కాదు..భాగ్యనగర బస్తీవాసులకు మందులు కొనే స్థోమత లేదు. పేదరికం, పెరిగిన ఇంటి ఖర్చులు, ప్రయాణ వ్యయాలు, అస్థిర ఉపాధి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి వంటి కారణాలు టైప్–2 మధుమేహ బాధితులను చికిత్సకు దూరం చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ కారణాలతో బాధితులు మెడిసిన్స్ ఆలస్యంగా వేసుకుంటున్నారని, నిర్ణీత కాలంలో పరీక్షలు చేయించుకోవడం లేదని ఐఐటీ హైదరాబాద్ అధ్యయనంలో తేలింది.
18 నెలల అధ్యయనం..
‘లివింగ్ విత్ డయాబెటిస్ ఇన్ హైదరాబాద్స్ అర్బన్ స్లమ్స్’ పేరిట ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ అలోక్ ఖండేకర్ పర్యవేక్షణలో మెడికల్ ఆంత్రోపాలజిస్ట్ సు«దీర్ రాజ్ థౌట్ 18 నెలల పాటు నగరంలో క్షేత్ర స్థాయిలో పరిశోధన చేశారు. పేద, తక్కువ ఆదాయం కలిగిన సపోటాబాగ్, దామోదర సంజీవయ్య నగర్ బస్తీల్లో 35 మంది టైప్–2 డయాబెటిస్ బాధితులు, 16 మంది కుటుంబ సంరక్షకులు, 16 మంది ఆశ కార్యకర్తలు, డాక్టర్లు, కమ్యూనిటీ లీడర్లను కలిసి డయాబెటిస్ వ్యాధి విస్తరణ, చికిత్సలు, సామాజిక ఆటంకాలపై అధ్యయనం చేశారు. ఇక తిండి, నడక, పని, ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, వలస, పట్టణీకరణ ఇవన్నీ మధుమేహాన్ని పెంచుతున్నాయని గుర్తించారు.
పండుగలు, కుటుంబ భోజనాల్లో డైట్ మార్చకపోవడం కూడా దీనికి కారణంగా వీరి అధ్యయనంలో తేలింది. వ్యాధి గ్రస్తులు అందుబాటులో ఉన్న బస్తీ దవాఖానలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు వెళ్లినా వారికి అక్కడ ఉచిత వైద్యసేవలు, మందులు, పరీక్షలు లభించక..సరైన సౌకర్యాలు లేక నిరాశకు గురవుతున్నారు.
అధ్యయనం సూచనలు ఏంటంటే..
పేదలకు సరైన వైద్యం అందించాలంటే ఏం చేయాలో పరిశోధకులు వివరిస్తూ పలు సూచనలు చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డయాబెటిస్ కేర్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. మందుల సరఫరా ఎప్పుడూ ఆగకూడదు. డయాగ్నోస్టిక్ సౌకర్యాలు పెంచాలి. ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి, ఇంటింటికీ తిరిగేలా చర్యలు తీసుకోవాలి. పేదలను కేవలం బాధితులుగా చూడొద్దని, వారిని పౌరులుగానే పరిగణించాలని, నిరంతరం గౌరవంగా, ప్రభావవంతంగా ఉండే వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వివరించారు.
తిండి కంటే మెడిసిన్ ముఖ్యం కాదట..
పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 28 మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల మందులు ఆలస్యంగా వేసుకుంటున్నామని తెలిపారు. చాలా కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవేనని గుర్తించారు. తిండి కంటే మెడిసిన్ ముఖ్యం కాదని భావించి.. ప్రాథమిక అవసరాలకే డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆహార భద్రత లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, మూఢ నమ్మకాలు చికిత్సపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ఇదీ చదవండి: పీజీ మెడికల్ ఫీజు పెంపునకు బ్రేక్


