జల దోపిడీకి రేవంత్‌ సహకారం | KTR Nagarjuna Sagar Water Dispute | Sakshi
Sakshi News home page

జల దోపిడీకి రేవంత్‌ సహకారం

Nov 19 2026 4:54 AM | Updated on Nov 19 2026 5:12 AM

KTR Nagarjuna Sagar Water Dispute

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు, మోదీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం

నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతుంటే ఉత్తమ్‌ ఎందుకు స్పందించలేదు?

ఏడాదిగా సొరంగం తవ్వుతున్నా ప్రభుత్వానికి తెలియదా?

రాష్ట్ర నీటి హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తాం

నల్లగొండలోనే బహిరంగ సభ నిర్వహిస్తాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీ నుంచి 9 టీఎంసీల నీటిని ఏపీ తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఏడాది కాలంగా నిర్మాణం కొనసాగుతుంటే నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతోందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసేలా ఏపీ జలదోపిడీకి పాల్పడే ప్రయత్నం చేస్తోందన్నారు.

నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్‌లకు నీరు అందకుండా డెడ్‌స్టోరేజీ నుంచి నీటి తరలించడానికి నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో బుధవారం ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి, సంజయ్‌కుమార్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 18 గంటలు పనిచేస్తానని చెప్పుకునే ముఖ్యమంత్రికి ఇంత పెద్ద ప్రాజెక్టు ఏడాదిగా జరుగుతున్న విషయం తెలియదా? అని నిలదీశారు.

తాగునీటి పేరుతో కుట్ర
తాగునీటి పథకం పేరుతో 1,650 కి.మీ. పైప్‌లైన్‌ నిర్మించి 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం ఏపీ చేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. పేరుకు తాగునీటి పథకమైనప్పటికీ, దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, తెలంగాణకు చెందిన నీటి హక్కులను దెబ్బతీసే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు.

నాగార్జునసాగర్‌ నుంచి డెడ్‌ స్టోరేజ్‌ నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతుంటే నల్లగొండ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగించే ఈ వ్యవహారానికి రేవంత్‌ ప్రభుత్వం ద్వారాలు తెరిచిందని, సీఎం వ్యక్తిగత బలహీనతలు దీనికి కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

ప్రభుత్వంలోనే గందరగోళం
ఆదిత్యనాథ్‌ దాస్‌ను సాగునీటి సలహాదారుగా నియమించుకోవడంపై కేటీఆర్‌ ప్రశ్నలు లేవనెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. పదవీ విరమణ చేసిన ఈఎన్సీ రమేశ్‌ బాబుకు ఏడాది పాటు పొడిగించి తిరిగి నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఏపీ చేపడుతున్న నీటి తరలింపును అడ్డుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో వెల్లడించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో నీటి కొరత ఉందని సీఎం చెబుతుంటే, నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం నీటి కొరత లేదని ప్రకటించడం ప్రభుత్వ గందరగోళానికి నిదర్శనమన్నారు. నీటి కొరత కారణంగా విద్యాసంస్థలు, హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితుల్లో మంత్రి మాత్రం నీటికి కొరత లేదని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు.

జల హక్కుల కోసం ప్రజా ఉద్యమం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు కృషి చేశామని కేటీఆర్‌ తెలిపారు. చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి హక్కుల విషయంలో మౌనం పాటిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి నాగార్జున­సాగర్‌లో తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామని, ప్రజా ఉద్యమం తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు. నల్లగొండలోనే బహిరంగ సభ నిర్వహిస్తామని, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: వచ్చేలోగా 'వడ్డీం'పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement